ఇప్పుడు దేశ వ్యాప్తంగా కీలకమైన చర్చ జరుగుతున్న అంశం రైతు వ్యతిరేక చట్టాల రద్దు ప్రకటన అంశమే. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అయితే ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు... దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలు చేపట్టారు. ఎండ, వానా, చలి అంటూ అన్ని తట్టుకుని తమ ఆందోళనను కొనసాగించారు. ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఎర్రకోటపై దాడి చేశారు. రాజధాని రహదారులను దిగ్భందం చేశారు. భారత్ బంద్ నిర్వహించారు. చివరికి పార్లమెంట్ బయట మాక్ అసెంబ్లీ నిర్వహించారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. సరిగ్గా రెండు రోజుల క్రితం సిక్కుల గురువు గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లులను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తామన్నారు.

అయితే ప్రధాని ప్రకటనను రైతులు మాత్రం ఏ మాత్రం స్వాగతించడం లేదు. బిల్లులను పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక వ్యాఖ్య చేశారు రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్. ప్రధాని చేసిన ప్రకటన తమకు సంతోషం కలిగించడం లేదన్నారు. ఏడాది కాలంగా ఈ బిల్లులపై పోరాటం చేసిన తమతో కనీసం చర్చించకుండా చట్టాలను వెనక్కి తీసుకోవడం సరి కాదన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు రైతు సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా రైతులంతా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు మోదీ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ సహా... ఎన్డీయే పార్టీలు కాస్త అసహనంతో ఉన్నాయి. ఇదే సమయంలో తమతో చర్చించిన తర్వాతే... నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తేల్చి చెప్పారు. లక్నోలో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమంలో రాకేష్ తికాయత్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: