ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే... వారం రోజులుగా ఆంధ్రా పాలిటిక్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాయి. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు అమరావతి ప్రాంత రైతుల మహా పాదయాత్ర, మరోవైపు హైకోర్టు కేసులు, ఇంకో వైపు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు... చివరగా ప్రకృతి వైపరీత్యాలు. పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. సరిగ్గా రెండేళ్ల క్రితం శాసన సభలో మూడు రాజధానుల ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు అదే అసెంబ్లీలో ఆ బిల్లును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే అప్పటి ఆ నిర్ణయాన్ని స్వాగతించిన ఉత్తరాంధ్ర వాసులు... ఇప్పుడు మాత్రం కాస్తంత ఆశ్చర్యానికి గురయ్యారు. 2019లో మూడు రాజధానుల ప్రకటన చేసిన ముఖ్యమంత్రి... పరిపాలన రాజధానిగా విశాఖ నగరాన్ని ప్రకటించారు. దీంతో... విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రకటించారు. దీంతో జగన్ నిర్ణయంపై సంబరాలు చేసుకున్నారు విశాఖ వాసులు.

నాటి ప్రకటన చేసిన తర్వాత శారదా పీఠాన్ని దర్శించుకునేందుకు తొలిసారి విశాఖ చేరుకున్న వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు ఉత్తరాంధ్ర వాసులు. జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత విశాఖ పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేతను వైసీపీ నేతలు విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. కనీసం ఎయిర్ పోర్టు కూడా దాటనివ్వలేదు. ఒక దశలో రాళ్లతో దాడి కూడా చేసేందుకు యత్నించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎయిర్ పోర్టు బయటే బైఠాయించారు. వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు. చివరికి పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి తరలించాల్సి వచ్చింది. అయితే ఇదంతా గతం. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులు కాస్తంత ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో మరోసారి సమగ్ర బిల్లు తయారు చేస్తామన్న ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటన చేసిన రెండేళ్లలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సొంత పార్టీ నేతలేమో... న్యాయ పరమైన చిక్కుల కారణంగానే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కాలేదని... మరో బిల్లు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ సర్కార్ కృషి చేస్తుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: