దేశంలో సెమీఫైనల్ ఎన్నికలకు అన్నీ పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టాయి. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు అయితే... దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఒక ఎత్తు. దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కూడా యూపీ ఎన్నికలపైనే దృష్టి పెడతాయి. యూపీలో అధికారంలోకి వచ్చిన పార్టీనే జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతుందని అన్నీ పార్టీల నమ్మకం. అందుకోసమే దాదాపు మూడేళ్లుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. యూపీ ఎన్నికల బాధ్యతను ఆ పార్టీ ముఖ్యనేత ప్రియాంకా గాంధీ వాద్రా చేపట్టారు. ఇప్పటికే యూపీలో సుడిగాల పర్యటనలు చేపట్టారు ప్రియాంక. ఇక యూపీలో జరిగిన లఖింపూర్ ఖేరీ, అత్యాచార ఘటనలను హైలెట్ చేస్తూ ప్రియాంకా దీక్షలు కూడా చేపట్టారు. అటు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మరో నేత శరద్ యాదవ్ కూడా యూపీలో మళ్లీ అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

యూపీ ఎన్నికలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. యూపీని తిరిగి దక్కించుకునేందుకు అవకాశం ఉన్న అన్ని దారులను బీజేపీ ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే యూపీలోని కేవలం వారణాసి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రమే 20 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మోదీ సర్కార్ చేపట్టింది. ఇక తాజాగా 23 వేల కోట్ల రూపాయలతో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హై వే ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే లఖింపూర్ ఖేరీ ఘటనకు బాధ్యుడిగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని అరెస్ట్ చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొత్త వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. మూడేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి ఏకంగా 50 శాతం పైగా ఓట్లు లభించాయి. దీంతో యోగీ ఆదిత్యానాథ్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. అయితే కరోనా సమయంలో యోగీ సర్కార్ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో యూపీ ఎన్నికల బాధ్యతను స్వయంగా నరేంద్ర మోదీ చేపట్టారు. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టేందుకు కూడా మోదీ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: