ఇండియాలో వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు ఉచితంగా ఇస్తోంది ప్రభుత్వం.. ఇప్పటికే చాలా మంది రెండు డోసులు తీసుకున్నారు. మొదట్లో టీకాల కొరత వేధించినా.. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. వంద కోట్ల డోసు మార్కు దాటి పోయింది. అయితే పెద్దవాళ్ల వరకూ ఓకే.. కానీ చిన్నారుల సంగతేంటి.. అన్న ప్రశ్న ఇన్నాళ్లూ వేధించేది.. కానీ ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోతోంది.. ఈ జనవరి నుంచే పిల్లలకు కూడా టీకా ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.  


పిల్లలకు కోవిడ్ టీకా ఇచ్చే అంశంపై కేంద్రం చర్చలు జరుపుతోంది. దేశంలో కరోనా టీకా పంపిణీ జోరుగా సాగుతున్నా పిల్లలకు ఇంకా కొవిడ్‌ వ్యాక్సిన్‌ రాలేదు. త్వరలోనే నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరో పక్షం రోజుల్లోఈ ఎన్‌టీఏజీఐ మీటింగ్ ఉంది. ఆ భేటీలో చిన్నారులకు టీకాపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుంచే పిల్లలకు టీకా పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  


పిల్లలకు టీకాలు ఇచ్చేటప్పుడు ముందు ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత ఇతర పిల్లలకు వేస్తారు. ఇప్పటికే జైడస్‌ క్యాడిలా సంస్థ పిల్లలకు టీకాను అభివృద్ధి చేసింది. ఈ  జైకోవ్‌-డి టీకాను 12-18 ఏళ్ల వయసు వారికి కూడా ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆ సంస్థ తెలిపింది. ఈ టీకాలు ఇప్పటికే కేంద్రం అత్యవసర అనుమతులిచ్చింది కూడా. కానీ టీకా పంపిణీ ప్రారంభించ లేదు.


మన దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ దాదాపు యథావిధిగా నడుస్తున్నాయి. అందుకే మళ్లీ మూడో వేవ్ సంకేతాలు రాక ముందే పిల్లలకు కూడా టీకా ఇచ్చేస్తే కరోనా బారి నుంచి వారిని కాపాడొచ్చన్నది నిపుణుల ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి: