ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సీఎం జగన్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని రద్దు చట్టాన్ని వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కలకలం మొదలైంది. అమరావతి రాజధాని రద్దు చేస్తూ గతంలో సీఎం జగన్ చట్టం చేయాలనీ అనుకున్నారు. మూడు రాజధానులు నిర్మిస్తామని, తద్వారా సమగ్ర అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో ఏమోగానీ సడెన్ గా అమరావతి రాజధాని రద్దు బిల్లును వెనక్కు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష రాజకీయ నేతల్లో ఆందోళన మొదలైంది. వారంతా ఇప్పుడు అసలు సీఎం స్ట్రాటజీ ఏమిటో అర్ధం గాక తలలు పట్టుకుంటున్నారు.

సీఎం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నప్పటికీ మరింత పగడ్బందీగా బిల్లును మరోసారి ప్రవేశపెడతామని చెప్పారు. త్వరలోనే మూడు రాజధానుల కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడతామని చెబుతున్నప్పటికీ.. దాన్ని 2024 వరకు సాగదీసే అవకాశముంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలకోసం మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అనే నినాదంతోనే ముందుకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఒకవేళ వైసీపీ ఇదే నినాదంతో ఎన్నికలకు వెళితే ప్రతిపక్ష టీడీపీ, వైసీపీ, బీజేపీల పరిస్థితి ఏమిటన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

ఎన్నికల నాటికి వైసీపీ మూడు రాజధానుల అంశంపై ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. తాము మూడు రాజధానులు నిర్మించాలనుకుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని కూడా ప్రచారం చేస్తుంది. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికోసం వైసీపీని గెలిపించాలని కోరుతుంది. పరిపాలనా వికేంద్రీకరణ తీసుకువద్దామనుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన వ్యవహరించిన తీరును ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. ఇలా ఒకే దెబ్బకు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఇరకాటంలో పడేసేఆలోచనలో ఉన్నారు సీఎం జగన్. అమరావతి రాజధాని విషయంలో ఒక అడుగు వెనక్కు వేసినప్పటికీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అమరావతి రాజధాని అంశం మరోసారి రచ్చ కెక్కింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రధాన అజెండా కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: