కొన్నిరోజుల వ్యవధిలోనే ఏపీ రాజకీయాల్లో చాలా పరిణామాలు జరిగిపోయాయి.. టీడీపీ అధినేత పట్టాభి వదిలిన బోషడీకే వివాదం.. ఆ తర్వాత అది కాస్త టీడీపీ ఆఫీసులపై దాడులకు కారణం కావడం.. దానికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేయడం.. ఏకంగా ఢిల్లీ వెళ్లి కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం.. ఇలా చకచకా పరిణామాలు సాగాయి. ఇంతలో అసెంబ్లీ ఎపిసోడ్ వచ్చేసింది.. నా భార్యను కించపరిచారంటూ సాక్షాత్తూ చంద్రబాబు ప్రెస్ మీట్‌లో భోరున విలపించడంతో సానుభూతి పవనాలు ప్రారంభమయ్యాయి.. ఈ ఎపిసోడ్‌లో వైసీపీ కాస్త డౌన్ అయ్యిందని భావించేలోపు.. వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం మళ్లీ తెరపైకి తెచ్చింది.


సరిగ్గా దీనికి కొన్నిరోజుల ముందు వరదలతో రాయలసీమ అతలాకుతం అయ్యింది. తిరుమల, తిరుపతిలో ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వరదలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ఏకంగా 15 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.. ఇంకా వేలా మంది వరద ముంపులోనే ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు జనంలోకి వెళ్తున్నారు. ఇవాళ్టి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. రెండ్రోజుల పాటు చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. కడప, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి.


ఇవాళ ఉదయం కడప జిల్లా వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. వరద బాధితులను పరామర్శిస్తారు. రాజంపేట మం. తొగూరుపేట, మందపల్లి, పులపుత్తూరు, గుండ్లూరులో చంద్రబాబు పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం రేణిగుంటలో.. రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఈ వరద ముంపు ప్రాంతాల బాధితులను సీఎం జగన్ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏదో అలా హెలికాప్టర్‌పై ఏరియల్ సర్వే చేశారు తప్ప.. బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఇదే సమయంలో ఆయన హైదరాబాద్‌లో ఓ వివాహానికి హాజరు కావడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ సమయంలో చంద్రబాబు ముంపు బాధితులను పరామర్శించడం కచ్చితంగా తెలుగు దేశానికి ప్లస్ పాయింట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: