అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే...అందులో సగం మంది వరకు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. అలాగే సగం మందికి ప్రజా మద్ధతు తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం...నియోజకవర్గాల్లో సమస్యలని పరిష్కరించకపోవడం, కష్టాల్లో ఉన్న ప్రజలని ఆదుకోకపోవడం.

అయితే ఈ విషయాల్లో ఒక ఎమ్మెల్యే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి అండగా ఉండటంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. అసలు వైసీపీలో మంచి పనితీరు కనబరుస్తున్న టాప్ ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి...టాప్-5 ఉంటారని చెప్పొచ్చు. ఇలా ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి కాబట్టే...ఇప్పుడు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తన చంద్రగిరి ప్రజలకు అండగా నిలబడుతున్నారు.

తాజాగా వరదలు చిత్తూరు జిల్లాని ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలబడటంలో మిగతా ఎమ్మెల్యేల పరిస్తితి ఎలా ఉందో తెలియదు గానీ, చెవిరెడ్డి మాత్రం ప్రజలతోనే ఉన్నారు. తాజాగా రాయలచెరువు కట్టకు గండి పడి చుట్టుపక్కల వందల గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాస్త లీకేజ్ రావడంతో దాదాపు 30 గ్రామాల ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్లి, ఇంకా భయంగుప్పిట్లోనే ఉన్నారు.

ఈ క్రమంలోనే రాయలు చెరువు కట్టకు ప్రమాదం వాటిల్లుతుందని ప్రజల ఆందోళనతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడకు చేరుకుని లీకేజి ప్రాంతాన్ని పరిశీలించి చెరువుకట్టపైనే నిద్రిస్తూ పనులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే బహిరంగ ప్రదేశంలోనే ఆయన స్నానం చేస్తూ అందుబాటులో ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే ఒక ప్రజాప్రతినిధిగా చెవిరెడ్డి...తన ధర్మంగా ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పొచ్చు. ఏదేమైనా చెవిరెడ్డి చేస్తున్న పనిని అంతా మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: