ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవ‌డానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు, ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు, నీటి వాటాల కేటాయింపుల్లో స్ప‌ష్ట‌త త‌దిత‌ర విష‌యాల పై చ‌ర్చించేందుకు సీఎం కేసీఆర్ హ‌స్తిన‌కు ప‌య‌న‌మ‌య్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఉన్న‌తాధికారుల బృందం ఢిల్లికి వెళ్లిన విష‌యం తెలిసిందే. సాయంత్రం బేగంపేట విమానాశ్ర‌యం నుంచి సీఎంతో పాటు వ్య‌వ‌సాయ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్‌, రైతు బంధు స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో క‌లిసి హస్తిన‌కు వెళ్లారు.


 అయితే, సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ‌కు ఏయిమ్స్‌లో ఆరోగ్య ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ప్ర‌స్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పౌర స‌ర‌ఫరాల శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్ కూడా కేసీఆర్ క‌ల‌వ‌నున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్ర మంత్రులు ముందుగా పీయూష్ గోయ‌ల్‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రుపుతారు. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయ‌న‌తో స‌మావేశం అవుతారు. అలాగే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసేందుకు పీఎంఓ ఆఫీసులో అనుమ‌తి కోరిన‌ట్టుగా తెలుస్తోంది.


  వ‌రుస భేటీల నేప‌థ్యంలో శుక్ర‌వారం వ‌ర‌కు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల పాటు కేంద్రంతో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రుపుతారోనన్న ఆస‌క్తి తెలంగాణ రాజ‌కీయాల్లో మొద‌ల‌యింది. అలాగే, ఢిల్లీలో ప‌ర్య‌ట‌న అనంత‌రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలాంటి రాజ‌కీయ వ్యూహాలు ఫాలో అవుతారోనన్న చ‌ర్చ అప్పుడే మొద‌ల‌యింది. దీంతో పాటు కేంద్రం మెడ‌లు వంచుతామ‌న్న కేసీఆర్.. ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: