తెలంగాణలో ప్రస్తుతం వరుసగా కొత్త ఎమ్మెల్సీలను సీఎం కేసీఆర్ భర్తీ చేస్తున్నారు. ఈ కొత్త ఎమ్మెల్సీల ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యి తర్వాత కెసిఆర్ తన కేబినెట్ ను చాలావరకు ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్లో మార్పులు చేర్పులపై లీకులు రావడంతో అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కేసీఆర్ క్యాబినెట్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు ? ఎవరు కొత్త‌గా క్యాబినెట్లోకి వ‌స్తారు ? అన్న దానిపై అధికార పార్టీ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

ఈ క్రమంలోనే కొత్త గా క్యాబినెట్ లోకి వచ్చే వారిలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి... తాజాగా ఎమ్మెల్సీగా ఎంపికైన బండ ప్రకాష్ ముదిరాజ్ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం తో తెలంగాణ లో ముదిరాజ్ సామాజిక వ‌ర్గం కెసిఆర్ పై కొంత అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలోనే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు బండ ప్రకాష్ ముదిరాజ్ ను కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది.

అలాగే సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి సైతం మంత్రి పదవి ఖాయం అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండు సార్లు వరుసగా ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన తీన్మార్ మల్లన్న తో పాటు కోదండరామ్ పై సంచలన విజయం సాధించారు.

రాజేశ్వ‌ర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అయ్యింద‌ని.. అదే నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డిని పక్కన పెట్టేసి మరి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇక ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మునుగోడు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: