తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందట. మంత్రుల్లో ఈ భ‌యానికి కారణం ఏంటి అన్నది లోతుగా పరిశీలిస్తే ఆసక్తి గల కారణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చే ఎమ్మెల్సీ ల్లో ఎవరు తమ పదవులకు ఎర్త్ పెడుతున్నారో ? అని తెలంగాణ మంత్రులు ఒకటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట‌. కెసిఆర్ ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా కింద 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు గవర్నర్ కోటాలో కూడా మరికొంత మంది ఎమ్మెల్సీలు ఎంపిక కానున్నారు. వీరంతా కూడా అధికార పార్టీకి చెందిన వారే.

ఎమ్మెల్యే కోటా లో బండ ప్రకాష్ ముదిరాజ్ తో పాటు మాజీ మంత్రి కడియం శ్రీహరి గుత్తా - సుఖేందర్ రెడ్డి - సిద్ధిపేట తాజా మాజీ క‌లెక్ట‌ర్ వెంకట్రామిరెడ్డి - హుజూరా బాద్ మాజీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉండి ఇటీవ‌లే కారెక్కిన పాడి కౌశిక్ రెడ్డి - ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కు చెందిన త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీందర్రావు ఎమ్మెల్యేలు అవుతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఈటెల రాజేంద్ర స్థానం  లో అదే సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ ముదిరాజ్ కు మంత్రి పదవి ఖాయం కానుంది.

దీంతోపాటు పనితీరు ఏమాత్రం సరిగా లేని మరో ముగ్గురు నలుగురు మంత్రులు తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. మల్లారెడ్డి - ఇంద్రకరణ్ రెడ్డి - జగదీశ్ రెడ్డి - కొప్పుల ఈశ్వర్ లను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. వీరితోపాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా పక్కన పెడతారు అన్న సందేహాలు ఉన్నాయి. గంగుల కమలాకర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో ఇప్పుడు ఈ మంత్రుల‌కు టెన్షన్ పట్టుకుంద‌న్న ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: