3 రాజ‌ధానుల బిల్లుకు సంబంధించి, ఇదివ‌ర‌కే అసెంబ్లీ వాకిట ప్ర‌వేశ పెట్టిన బిల్లు ర‌ద్ద చేస్తూ వైసీపీ స‌ర్కారు త‌మ నిర్ణ‌యం వెన‌క్కు తీసుకునేందుకు సంబంధించి చాలా చాలా అనుబంధం ప‌రిణామాలు న‌మోదు అవుతున్నాయి. యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న స్టాండ్ ఏంటో చెప్పినా కూడా అందులో స్ప‌ష్ట‌త లేదు. చెప్ప‌క‌పోయినా బాగుండేదేమో! త‌మ‌కు మూడు ప్రాంతాల అభివృద్ధీ ముఖ్య‌మేన‌ని జ‌గ‌న్ అన‌డంలో త‌ప్పు లేదు కానీ అందుకు చేపట్ట‌బోయే ప్ర‌ణాళిక‌ల గురించి ఆయ‌న మాట్లాడ‌క‌పోవ‌డం విచార‌క‌రం.


అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు తాము బీజం వేస్తున్నామ‌ని లేదా నాంది ప‌లుకుతున్నామ‌ని రెండున్న‌రేళ్లుగా చెబుతున్నారే కానీ ఇప్ప‌టిదాకా వెనుక‌బ‌డిన ప్రాంతాలకు మ‌రియు ఊళ్ల‌కు రోడ్లు వేసిన దాఖ‌లాలే లేవు అని అంటోంది టీడీపీ. వైసీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చాక కేంద్రంతో మంచి అనుబంధ‌మే ఉంది క‌నుక ఎంచ‌క్కా ఆ ఢిల్లీ పెద్ద‌ల సాయంతో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల‌కు మాత్రం ర‌హ‌దారులు వేయ‌గ‌లిగారు. ఈ ఒక్క ప‌ని మాత్రం వేగ‌వంతంగానే పూర్తి చేసి అనుకున్న ల‌క్ష్యాలు అనుకున్న విధంగానే సాధించ‌గ‌లిగారు.

ఇక వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ముఖ్యంగా మా శ్రీ‌కాకుళం మొద‌లుకుని విశాఖ వ‌ర‌కూ ఇంకా చెప్పాలంటే సీమ పల్లెల‌కూ సీఎం హోదాలో జ‌గ‌న్ స‌ర్ చేసిందేం లేదు. ఇక మెరుగైన బిల్లు అని అంటున్నారు కానీ దీనికి టైమ్ బౌండ్ ఏమీ లేద‌ని, నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో తీసుకువ‌స్తామ‌ని ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌లేం అని మంత్రి పేర్ని నాని అంటున్నారు నిన్న‌టి వేళ. ఇక మెరుగైన బిల్లు అంటే ఏంటి న్యాయ ప‌ర‌మైన అడ్డంకులు అన్నీ తొల‌గించుకుని త‌మ‌కు ఇప్పుడిప్పుడే బ‌లం ఉన్న శాస‌న మండలిలోనూ అదేవిధంగా ఇప్ప‌టికే బలం ఉన్న శాస‌న స‌భ‌లోనూ త‌మ వాదం నెగ్గించుకోవ‌డ‌మే క‌దా! ఇంత‌కుమించి జ‌గ‌న్ స‌ర్ సాధించేదేంటి? కేవ‌లం రాజ‌ధాని కేంద్రంగా ఉన్న పెట్టుబ‌డి దారుల‌ను వెన‌క్కు ర‌ప్పించేందుకు, అదేవిధంగా విశాఖ కేంద్రంగా పెట్టుబ‌డిదారుల‌ను ర‌ప్పించేందుకు జ‌గ‌న్ వ్యూహం ఇది కావొచ్చు. అందుక‌నో ఎందుక‌నో మెరుగైన బిల్లు అంటూ తెర‌పైకి మ‌రో కొత్త విష‌యం తీసుకువ‌చ్చి ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: