ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా రోజు వారీ కేసుల సంఖ్య పది వేలు కూడా దాటడం లేదు. ఇక కొవిడ్ మరణాల సంఖ్య కూడా బాగా పడిపోయింది. ఈ ఏడాది జనవరి 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసుల సంఖ్య వంద కోట్లు దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పడిపోయింది. ప్రజలు కూడా సాధారణ జీవితానికి అలవాటు పడిపోయారు. ఇక చాలా చోట్ల అయితే కొవిడ్ నిబంధనలు కూడా పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్న వాళ్లని ఇప్పుడు విచిత్రంగా చూస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టందని వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి కూడా. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కొవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని ఓ గురుకుల పాఠశాలలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాలోని వైరా గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో కొవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి.

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు సిబ్బంది. ఇందులో ఏకంగా 29 మందికి వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో సిబ్బంది షాక్ అయ్యారు. వైరస్ తగ్గుముఖం పట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ వైపు ప్రకటించినప్పటికీ... క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. రెసిడెన్సియల్ పాఠశాలల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఏకంగా 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. విద్యార్థులకు కరోనా ఉన్నట్లు తెలియడంతో... మిగిలిన విద్యార్థులు తల్లిదండ్రులు... తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఇక భోధన, భోధనేతర సిబ్బంది కూడా ప్రస్తుతం కలవర పడుతున్నారు. వైరస్ సోకడానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేవని... అసలు కరోనా జాగ్రత్రలు పాటించడం లేదన్నారు. లక్షణాలున్నట్లు ముందుగా తోటి విద్యార్థులు తెలిపినా కూడా... అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా సోకిన వారికి స్పల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని... పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: