మా ప్రాంతం అభివృద్ధిలో లేదు తీవ్ర‌మ‌యిన క‌ష్టాల‌లో ఉంది. కానీ మా ప్రాంతం ఇన్నేళ్లుగా ప‌ట్టింపు లో లేదు. కానీ మా ప్రాంతం గురించి  మా స్పీక‌ర్ ఏడుస్తారు. ఎందుకు అంటే సానుభూతి కోసం.. అంత‌కుమించి ఆయ‌న నుంచి కానీ మా నాయ‌కుల నుంచి కానీ మేం ఆశించేదేమీ లేదు గాక లేదు. 70 ఏళ్ల కు పైగా అనుభ‌విస్తున్న వెనుక‌బాటులో ఎవ‌రి వాటా ఎంత అన్న‌ది తేలిపోతే బాగుండు. ఉద్య‌మాల గ‌డ్డ‌పై మ‌రో ఉద్య‌మం వ‌స్తే బాగుండు. అది ప్ర‌త్యేక ఉత్త‌రాంధ్ర ఉద్యమం అయితే ఇంకా బాగుండు.


చాలా రోజుల కింద‌ట చాలా విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. స‌మైక్యాంధ్ర అన్న‌ప్పుడు లేదా వేర్పాటు త‌ప్ప‌దు అని అనుకుంటున్న‌ప్పుడు మాకెందుకు ఈ గొడ‌వ మ‌మ్మ‌ల్ని ఒడిశాలో క‌లిపేయండి అని అడిగారు కొంద‌రు శ్రీ‌కాకుళం మేథావులు.. అది వారి విజ్ఞ‌త. అది వారికి ఉన్న అవ‌గాహ‌న. లేదంటే ఆ రోజు ఉన్న స‌మాచారం అనుస‌రించి అటు గంజాం ప‌ర్లాకిమిడి ప్రాంతాల‌తో పాటు ఇటు మూడు జిల్లాల ఉత్త‌రాంధ్ర‌ను క‌లిపి ప్ర‌త్యేక‌మ‌యిన రాష్ట్రంగా ప్ర‌క‌టించ‌మ‌ని కూడా అడిగారు.ఇప్పుడివ‌న్నీ ఎందుకు మాకూ ఓ రాజ‌ధాని కావాలి.. అది మా శ్రీకాకుళ‌మే కావాలి అని కోరుకోవ‌డం త‌ప్పు లేదు క‌దా! వైజాగ్ పై ప్రేమ కార‌ణంగా జ‌గ‌న్, అమ‌రావ‌తిపై ప్రేమ కార‌ణంగా చంద్ర‌బాబు ఇలా ఇద్ద‌రూ చెరో ఊరూ పంచేసుకున్నాక క‌నీసం ఆ జ‌న‌సేనాని ప‌వ‌న్ అయినా మా ఊరిపై ప్రేమ పెంచుకుని శ్రీ‌కాకుళాన్ని రాజ‌ధాని చేయాల‌ని ఎందుకు అడ‌గ‌రు. ఎందుకు ఇవ్వరు..అంటే ఆర్థిక ఎదుగుద‌ల ఉన్న ప్రాంతాలే మీకు కావాలి త‌ప్ప అభివృద్ధి ప‌రంగా అతీగ‌తీ లేని వాటిపై మీకు ప్రేమ శూన్యం అని తేలిపోయింది క‌దా! ఈ పాటి దానికి మీరు రాజ‌ధాని పేరిట నాట‌కాలు న‌డ‌పడం దేనికి? ఎవ‌రి కోసం ఎందుకోసం?

రాజ‌ధాని ఏద‌యినా మాకు అభ్యంత‌రం లేదు అనేంత అమాయ‌కులు మా ఊరి వాళ్లు. అందుకే మాకు రాజ‌కీయం కావాలే కానీ రాజ‌ధాని అవ‌స‌రం లేదు. ఆ విధంగా మేం ముందున్నాం. ఆ విధంగా మేం వెన‌క‌బ‌డిపోయాం. అవును మా ధ‌ర్మాన అన్న విధంగా రాజ‌ధానితో మాకు ప‌నేంటి? ఆహా! ఒక‌వేళ రాజ‌ధాని విశాఖ అయిందే అనుకోండి ఈ ప్రాంతానికి వ‌చ్చే లాభం ఏంటి.? ఇప్ప‌టికిప్పుడు రియ‌ల్ వెంచ‌ర్లు రావ‌డం త‌ప్ప ఆ విధంగా మా రాజకీయ నాయకుల పొలాలో స్థ‌లాలో విలువ  పెంచుకోవ‌డం త‌ప్ప మాకు జ‌రిగిందేంటి ఉండ‌దు గాక ఉండ‌దు. క‌నుక రాజ‌ధానితో మాకు ప‌నే లేదు. అస‌లు మాకు వేటితోనూ సంబంధం ఉండ‌దు ఎందుకంటే మేం ఓ మూల‌న ఉన్న వారం. ఎవ్వ‌రితోనూ నీళ్ల త‌గాదా లేని వాళ్లం.  కొద్దిగా అరిస్తే ఒడిశా అరుస్తుంది. ఆ అరుపు కూడా మాకు పెద్ద‌గా ప‌ట్ట‌దు లేండి అది వేరే విష‌యం. అలాంట‌ప్పుడు మాకు రాజ‌ధాని న‌జరానాల‌తో మాకు ప‌నేంటి?


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp