ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రెండు రోజులుగా హాట్ హాట్‌గా మారిపోయాయి. ఓ వైపు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. అధికార వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం... గెలిచిన తర్వాతే సభకు వస్తానని శపధం కూడా చేశారు. అన్నట్లుగానే ఈరోజు నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు తన పర్యటన ప్రారంభించారు. ఇక న్యాయస్థానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్ సర్కార్ చాకచక్యంగా వ్యవహరించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ తీసుకున్న బిల్లును వైసీపీ సర్కార్ శాసన సభలో ఉపసంహరించుకుంది. అలాగే ఈ రోజు శాసన మండలి రద్దు బిల్లును కూడా వైఎస్ జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించామని గర్వంగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. అది కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన నేతలే.

కడప జిల్లా ఖాజీపేట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 13 మంది సర్పంచులు  మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో భూములు తాకట్టు పెట్టుకుని పనులు చేయించామని సర్పంచుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తామంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాకుండా... 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించినట్లు సర్పంచులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధపడ్డట్లుగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఖాజీపేట మండలంలోని ఆయా పంచాయతీలలో... వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులను, శానిటేషన్ కార్యక్రమంతో పాటుగా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించారు. ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తామంతా వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నామని.. అయితే ప్రభుత్వ విధానాల వల్లే పార్టీకి ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు. ఎనిమిది నెలలుగా గ్రామాల్లో రిపేరు చేసిన మోటార్ బిల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం లేక ఆవేదనతో రాజీనామా చేసినట్లు లేఖలో ప్రస్తావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: