టమాటో ధర భయపెడుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఇంటి వంటింట్లో కూడా టమాటో వాడకం తప్పనిసరి. టమాటో లేకుండా కూరలు చేయడం కష్టమే. పప్పుచారు అయినా.. పులుసు చేయాలన్నా సరే... కనీసం ఒకటైనా టమాటో ఉండాల్సిందే. టమాటో లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి లేదేమో. అలాంటి టమాటో ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. కనీసం ఒక్క టమాటో కోయాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందుకు ప్రధాన కారణంగా టమాటో ధర. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీ టమాటో ఏకంగా 130 రూపాయలు పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 రూపాయలకు లభించిన టమాటో.... వారం రోజుల్లోనే 8 రెట్లు పెరిగింది. దీంతో వంటింట్లో టమాటో వాడకాన్ని చాలా మంది తగ్గించేశారు. అటు హోటళ్లలో కూడా టమాటోతో చేసే రకాలను ఆపేస్తున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం... అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారు.

టమాటోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ ఫేమస్. అక్కడి నుంచి నిత్యం వందల టన్నుల టమాటో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటుంది. అయితే వారం రోజులుగా భారీ వర్షాలు రాయలసీమ ప్రాంతాన్ని ముంచెత్తాయి. గతంలో ఎన్నడు లేనంత వరద కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కుదిపేసింది. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. ఇప్పటికీ ప్రజలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. వేల ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. దీంతో పంట నష్టం భారీగానే ఉంది. అదే సమయంలో ఇప్పటికే మార్కెట్‌కు చేరుకున్న పంటను రవాణా చేసేందుకు కూడా మార్గం లేకుండా పోయింది. ఈ కారణాలతో మార్కెట్లకు టమాటో రాక భారీగా పడిపోయింది. ఫలితంగా కిలో టమాటో ధర ఏకంగా 130 రూపాయలు దాటేసింది. అటు ఇతర కూరగాయల ధరలు కూడా సామాన్యులను భయపెడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట చేతికి రాక అన్నదాతలు లబోదిబో  అంటున్నారు. మదనపల్లె మార్కెట్‌లో 28 కేజీల టమాటో క్రేట్ ధర ఏకంగా 3 వేల 500 రూపాయలు పలుకుతోంది. అంటే హోల్ సేల్‌గా కిలో టమాటో ధర 125 రూపాయలు. వినియోగదారులకు చేరే సరికి మరో 30 నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: