రోజు రోజుకూ పెరుగుతున్న చమురు ధరలు కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక దశలో సెంచరీ దాటేశాయి. పెట్రోల్ ధర అయితే కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా 120 రూపాయలు దాటేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎఫెక్ట్ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. చివరికి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కమలం పార్టీ గెలవలేక పోయింది. ఇదే సమయంలో మరో 4 నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో పెట్రో ధరల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రాలు కూడా వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని సూచించింది కేంద్రం. అయితే బీజేపీయేతర రాష్ట్రాలు ఆదాయం పోతుందనే భయంతో వ్యాట్ తగ్గించకపోవడంతో... చమురు ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి కూడా పెరిగింది.

పెట్రో ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా, జపాన్ సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో కలిపి ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వ నుంచి దేశ అవసరాల కోసం దాదాపు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలో మొత్తం మూడు ప్రదేశాల్లో భూగర్భ గుహల్లో సుమారు 38 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు కేంద్ర నిల్వ చేసింది. వీటిలో విశాఖపట్నంలో కూడా దాదాపు 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ప్రస్తుతం నిల్వ ఉంది. ఇందులో దాదాపు 5 మిలియన్ బ్యారెళ్లను వారం నుంచి పది రోజుల్లో విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ముడిచమురును మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ సంస్థలకు కేంద్రం విక్రయిస్తుంది. అత్యవసర నిల్వలు విడుదల చేయడం ద్వారా చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: