ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యధికంగా విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వ విభాగం పోలీసు శాఖ మాత్రమే. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అందరి పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలి. కానీ ఏపీలో మాత్రం దాడికి గురైన వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం, ఎస్సీల పైనే అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీని వల్ల అటు విపక్షాలు, ఇటు న్యాయస్థానాలు కూడా పోలీసుల తీరును తప్పుబట్టాయి. ప్రతిపక్ష నేతలను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఏపీ పోలీసులపై కోకొల్లలు. అధికార పార్టీ నేతల చెప్పినట్లుగా  పోలీసులు ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఇటు రాష్ట్ర రాజధాని దగ్గర నుంచి... గ్రామస్థాయి వరకు కూడా ఉందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఆరోపణలకు దారి తీస్తోంది. కౌన్సిల్ ఎన్నిక కోసం విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్‌లో కూర్చున్న సమయంలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశించారు. అక్కడ రణరంగం సృష్టించారు. హాల్‌లో బల్లులు, కుర్చీలు విరగ్గొట్టారు. ఓ ఎంపీ కూర్చున్న సమయంలోనే ఇలా జరిగినప్పటికీ... పోలీసులు కనీసం రక్షణ చర్యలు కూడా చేపట్టలేదు. చివరికి వైసీపీ నేతలను బయటకు తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు కౌన్సిల్ హాల్ లోనికి రాలేదు. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కౌన్సిల్ హాల్ లోనికి బయట వ్యక్తులు ఎలా వచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు దారులను మునిసిపాలిటీకి కిలోమీటర్ దూరంలోనే ఆపేసిన పోలీసులు... వైసీపీ నేతలను మాత్రం కౌన్సిల్ హాల్‌ లోపలికి ఎలా అనుమతించారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: