ఆర్థిక ఇబ్బందులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అవకాశం ఉన్న ప్రతి చోట అప్పులు చేసేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... కొత్త అప్పుల కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేందుకు రెడీ అయ్యింది. విశాఖ నగరంలోని ప్రభుత్వ ఆస్తుల తాకట్టు ద్వారా ఇప్పటికే దాదాపు 3 వేల 500 కోట్ల రూపాయల రుణం సేకరించింది జగన్ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ కూడా జీతం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాల చెల్లింపు కూడా ఆలస్యం అవుతోంది. ఇక రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అయితే ప్రతి నెలా ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు కూడా. ఏపీకి రుణ పరిమితిని పెంచాలని ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ అధికారులు ఎన్నో లేఖలు కూడా రాశారు. ఈ నెల 14వ తేదీన తిరుపతి పట్టణంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వద్ద ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ సమయంలో కీలక ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా.. ప్రస్తుత ప్రభుత్వానికి రుణ పరిమితి విధించారని... దీనిని వెంటనే తొలగించాలని కూడా జగన్ ప్రస్తావించారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 3 వేల 847.97 కోట్ల రూపాయలను తాజాగా కేంద్రం విడుదల చేసింది. రెండు నెలల వాయిదాల సొమ్మును 28 రాష్ట్రాలకు ఒకేసారి విడుదల చేసింది కేంద్రం. మొత్తం 95 వేల 82 కోట్ల రూపాయలను 28 రాష్ట్రాల ఖాతాల్లో జమ చేసింది. నవంబర్, డిసెంబర్ నెల వాయిదాల సొమ్మును ఒకేసారి విడుదల చేయాలని ఈ నెల 15న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఒక్కో నెలకు కేంద్రం 47 వేల 541 కోట్ల రూపాయలను తన వంతుగా రాష్ట్రాలకు విడుదల చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: