ఎన్ని ఆరోపణలు వచ్చినా  సరే... ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు మాత్రం మారటం లేదు. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత వివాదాస్పదంగా మారిన శాఖ కేవలం పోలీస్ శాఖ మాత్రమే. అటు డీజీపీ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న హోమ్ గార్డు వరకు దాదాపు ప్రతి ఒక్కరిపైన విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం ప్రతిపక్ష నేతలనే  పోలీసులు టార్గెట్ చేసుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో వ్యవహరించిన తీరు, ఇతర టీడీపీ నేతలపై బనాయించిన కేసులు... అరెస్టులు, రిమాండ్‌లు... ఇలా ఎన్నో అంశాలు పోలీసుల పనితీరుకు మాయని మచ్చగా మిగిలాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేస్తే... పోలీసులు ముందుగా టీడీపీ నేతలనే అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలపై రాజద్రోహం కేసు కూడా నమోదు చేశారు.

ఇప్పటికే అమరావతి రైతుల మహా పాదయాత్ర విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా పోలీసులు.. మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న వరద ప్రాంతాల్లో పర్యటనకు నెల్లూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెళ్లారు. అయితే దాదాపు పది రోజులుగా వర్షాలు కురుస్తున్నా కూడా తమను ఎవరు పట్టించుకోలేదని.. ఇప్పుడు మీరు వచ్చింది ఎందుకూ అంటూ అక్కడి స్థానికులు మంత్రిని, ఎమ్మెల్యేను నిలదీశారు. సాయం చేయకుండా రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులను అడ్డుకుని... మంత్రి బాలినేనిని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు... పోస్ట్ చేసిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరంతా స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు కావడంతో... జనసేన నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: