రాజధాని మార్పు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం ఇది. రెండేళ్ల క్రితమే జగన్ ఏపీ రాజధాని మార్పు గురించి ఆలోచన చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. అసెంబ్లీలో బలం ఉంది కాబట్టి చట్టం కూడా చేశారు. కానీ మండలిలో బిల్లు ఆమోద ప్రక్రియ సరిగ్గా జరగలేదు. అప్పట్లో వైసీపీకి మండలిలో మెజారిటీ లేదు. ఆ తర్వాత అనేక మంది రాజధాని మార్పుపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఈ రాజధాని మార్పు చట్టాన్ని పెండింగ్‌లో పెట్టేసింది.


అయితే తాజాగా ఉన్నట్టుండి జగన్ సర్కారు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంది. మరింత మెరుగైన చట్టం తెస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు అంశానికి సంబంధించి చరిత్రలో జరిగిన ఓ ఘటన గుర్తుకొచ్చింది. గతంలోనూ ఈ దేశంలో అనేక సార్లు రాజధానులను మార్చిన ఘటనలు ఉన్నాయి. గతంలో తుగ్లక్ అనే ఢిల్లీ సుల్తాన్ రాజధానిని దిల్లీ నుంచి దేవగిరికి.. దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చి అభాసుపాలయ్యాడు. ఇప్పుడు దేశ రాజధానిగా వెలుగొందుతున్న ఢిల్లీ మొదటి నుంచి ఇండియాకు రాజధాని కాదు అన్న సంగతి చాలా మందికి తెలియదు.


ఆంగ్లేయులు ఇండియాలో 1600 సంవత్సరాల్లో వచ్చారు. అప్పటి నుంచి ఒక్కో అడుగు వేస్తూ కొన్నేళ్లలోనే దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే మొదటి నుంచి ఆంగ్లేయులు ఇండియాలో కలకత్తానే రాజధానిగా చేసుకున్నారు. దాదాపు 300 ఏళ్ల పాటు కలకత్తా భారత దేశ రాజధానిగా ఉంది. అయితే.. అనూహ్యంగా 1911లో దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని ఆంగ్లేయులు నిర్ణయించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. భారత దేశం మొత్తంపై పట్టు సాధించాలంటే ఢిల్లీ సరైక కేంద్రం అని వారు భావించారు.


కలకత్తా దేశానికి ఓ మూలన ఉంటుంది. అందులోనూ 1910 నాటికి కలకత్తాలో విప్లవ పార్టీల ప్రభావం ఎక్కువవుతోంది. ఈ కారణాలతో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. అయితే కలకత్తా రాజధానిగా వందల ఏళ్లు పాలించిన ఆంగ్లేయులు.. ఢిల్లీకి రాజధాని మార్చిన 37 ఏళ్లలోనే అధికారం వదులుకుని లండన్ వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇదీ చరిత్రలోని ఓ రాజధాని మార్పు కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: