కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది ఏళ్లు గడుస్తున్నాయి. ఈ ఎనిమిది ఏళ్లలో ఆయన అనేక మార్పులు తెచ్చారు. కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు పూర్తి చేశారు. విద్యుత్ సమస్య లేకుండా చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు తెచ్చారు. తాగునీటి సమస్య తీర్చారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ సాధించిన విజయాలు ఎన్నో.. అయితే అదే స్థాయిలో వైఫల్యాలు కూడా ఉన్నాయి.


అసలు తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాలు అనే ప్రాతిపదికన.. నిధులు, నీళ్ల సంగతి ఓకే కానీ.. నియామకాలు మాత్రం అనుకున్న స్థాయిలో జరగనేలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్లు కొన్ని పూర్తి చేయడం.. మరికొన్ని చిన్నా చితకా నోటిఫికేషన్లు ఇవ్వడం మినహా పెద్దగా ఉద్యోగాలు కల్పించలేదు. దీనికి అనేక అడ్డంకులను కారణంగా చెబుతున్నారు. స్థానికులకు అత్యధిక ప్రయారిటీ ఇచ్చేలా 33 జిల్లాలను జోన్ల ప్రకారం విభజిస్తున్నామని అందుకే ఆలస్యం అవుతోందని చెబుతున్నారు.


మొత్తం తెలంగాణలో 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఏయ్.. అధికారులూ.. ఏం చేస్తున్నారు.. రెండు మూడు నెలల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇయ్యాలె.. ఇకపై దీన్ని నేనే పర్యవేక్షిస్తా.. అంటూ కేసీఆర్ గత నవంబర్‌ లోనూ రంకెలు వేశారు.. అలా ఆయన రంకెలు వేసి ఏడాది దాటిపోయింది. కానీ నోటిఫికేషన్లు మాత్రం రాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియదు.  ఏదైనా అడిగితే.. ఉద్యోగాల విభజన, కేటాయింపులు జరుగుతున్నాయి. లెక్కలు తేలుస్తున్నారు. అవి అయ్యాక అంటున్నారు.


అయితే ఈ జిల్లాల వారీ విభజన, కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయని.. కొత్త ఏడాది సందర్భంగా భారీ స్థాయి నోటిఫికేషన్ రావచ్చని చెబుతున్నారు. జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేస్తారని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆచరణలోకి వస్తుందా.. అని ఆశగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: