ఏపీలో వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు జనసేన పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని, నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. తాజాగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శిస్తున్నారు. అయితే ఈ పరామర్శల కార్యక్రమంలో నాదెండ్లను జర్నలిస్టులు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మూడు రాజధానుల అంశంపై స్పందించాలంటూ నాదెండ్లను కోరుతున్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న అనంతరం, జనసేన అధినేత పవన్ రాసిన లేఖపై కూడా వివరణ కోరుతున్నారు. అయితే నాదెండ్ల మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కేవలం వరద పరిస్థితిపై మాత్రమే స్పందిస్తున్నారు.

చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి నగరంలో నాదెండ్ల పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. తిరుపతి పట్టణంలోని కొర్లగుంట, కట్టకిందపల్లి, తదితర ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన జనసేన డాక్టర్స్ సెల్ సభ్యులను ఆయన అభినందించారు. నిత్యావసర సరుకులతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ ప్రాంతంలోనూ జర్నలిస్టులు పదేపదే మూడు రాజధానుల అంశంపై మాట్లాడాలని కోరినా.. నాదెండ్ల సమాధానం దాట వేశారు. కేవలం వరదల అంశంపై మాత్రమే మాట్లాడతానని తేల్చి చెప్పారు. దీంతో జర్నలిస్టులు కూడా సైలెంట్ అయిపోయారు. ఆయన చెప్పింది రాసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే మూడు రాజధానుల గురించి నోరుమెదపని నాదెండ్ల, వైసీపీ ప్రభుత్వంపై మాత్రం విరుచుకుపడ్డారు. వరదల కారణంగా ప్రజలు అవస్థలు పడుతుంటే, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జగన్ కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా మారిపోయారని ఎద్దేవా చేశారు. వరదల్లో ప్రజలు ఏడుస్తుంటే కనీసం పలకరించే దిక్కు లేకుండా పోయిందని చెప్పారు. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందేలా చూస్తామని అన్నారు. నాదెండ్ల మాట్లాడిన తీరు చూస్తుంటే వరదల సమయంలో ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో పవన్ కళ్యాణ్ చెప్పి పంపినట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: