ఇంద్రసేనా రెడ్డి....  సీమ ప్రజలు కష్టాల్లో ఉంటే... ఎప్పుడైనా వస్తా... ఎలాగైనా వస్తా... ప్రజల కోసమే నా జీవితం... అంటూ భారీ భారీ సినిమా డైలాగులు చెప్పిన హీరో ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించటం లేదు. దాదాపు పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాల కారణంగా.... భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా వర్షాలకు ప్రభావితం అయ్యాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు అన్నదాతలు. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. ఇప్పటికే ఒక్క కడప జిల్లాలోనే 30 మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు లెక్కలు ప్రకటించారు. ఇక 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. గతంలో ఎన్నడూ లేనంతంగా తిరుమలకు వెళ్లే అన్నీ మార్గాలను కూడా టీటీడీ అధికారులు రెండు రోజుల పాటు మూసివేశారు.

పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులే దేవుళ్లు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన మెగాస్టార్ కుటుంబం ఇప్పుడు కనీసం కనిపించటం లేదు. అసలు ఏమయ్యారో కూడా తెలియటం లేదు. భారీ వర్షాలకు ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలు నష్టపోయాయి. నెల్లూరు చిరంజీవి సొంత జిల్లా. అక్కడే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు. ఇక చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిరంజీవి 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం కూడా సాధించారు. తిరుపతి ఎమ్మెల్యేగా దాదాపు రెండేళ్ల పాటు వ్యవహరించారు చిరంజీవి. అలాంటి మెగాస్టార్... ఇప్పుడు తిరుపతి పట్టణం మూడు రోజుల పాటు నీటిలో నానిపోతే... కనీసం పట్టించుకోలేదు. తిరుపతి వాసులు ఎలా ఉన్నారో కూడా వాకబు చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెగాస్టార్... కనీసం వరదలకు సంబంధించి ఒక సానుభూతి పోస్టు కూడ పెట్టలేదు. ఏదైనా సమస్య వస్తే వచ్చేస్తా అంటున్న మెగాస్టార్... ఏమయ్యారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: