సేవ్ అమరావతి అంటూ న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో 41 రోజుల పాదయాత్ర చేపట్టారు అమరావతి ప్రాంత రైతులు. ఇప్పటికే ఈ యాత్ర గుంటూరు, ప్రకాశం జిల్లాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. రైతుల పాదయాత్రపై మొదటి నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. రైతులు చేపట్టిన పాదయాత్రను తెలుగుదేశం పార్టీ యాత్రగా అభివర్ణించారు కూడా. ఈ యాత్రలో రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ నేతలే ఎక్కువగా పాల్గొంటున్నారని కూడా ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళలు 700 రోజులు దాటిపోయాయి. అమరావతి నగరమే రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేస్తూ... రైతులు పాదయాత్ర చేస్తున్నారు.

వర్షాలు, వరదల మధ్య కూడా రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే రైతులు చేపట్టిన పాదయాత్రకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండగా ఉండగా... ఇప్పుడు బీజేపీ నేతలు కూడా యాత్రకు సంఘీభావం తెలిపారు. 24 రోజులుగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల కాళ్లు బొబ్బలు ఎక్కాయి. కొంతమంది కాళ్లు వాపు వచ్చాయి. దీంతో పాదయాత్ర కాస్త నెమ్మదిగా సాగుతోంది. యాత్రకు సంఘీభావం తెలిపిన నెల్లూరు జిల్లా రైతులు... మహిళల పాదాలకు పాలాభిషేకం చేశారు. ఇక రైతుల పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ అరవింద్ బాబు 3 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత బీద రవిచంద్ర కూడా తన వంతు సాయంగా 3 లక్షల రూపాయలు రైతులకు అందజేశారు. రాజధానిగా అమరావతిని సాధించే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: