దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పరస్పరం దూషించుకునే ఇద్దరు వ్యక్తులు భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీని మమతా బెనర్జీ ఆయన కార్యాలయంలో కలవనున్నారు. ఇప్పటికే హస్తిన పర్యటనలో ఉన్న దీదీ... బీజేపీ సీనియర్ నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో భేటీ కానున్నారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒక దశలో మమతాను ఓడించేందుకు టీఎంసీ కీలక నేతలను తమ వైపు తిప్పుకున్నారు ప్రధాని మోదీ. అలాగే దీదీని ఓడించి తీరుతామని కూడా శపథం చేశారు. కానీ... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మమతా ఘన విజయం సాధించారు. బీజేపీ కనీసం మూడంకెల సీట్లు కూడా సాధించలేదు.

చివరికి భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కూడా మమతా 50 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. భవానీపూర్ ఉప ఎన్నిక తర్వాత మమతా తొలిసారి ఢిల్లీ వెళ్లారు. దీంతో ఈ పర్యటన సర్వత్రా ఆసక్తిగా మారింది. ఓ వైపు ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. బీజేపీపై మొదటి నుంచి యుద్ధం చేస్తున్న మమతా బెనర్జీ... మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా కూడా పావులు కదుపుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో కూడా సమావేశమయ్యారు. అదే సమయంలో గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా మమతా భేటీ అయ్యారు. అయితే బెంగాల్‌లో ప్రస్తుతం తృణమూల్ ఓ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంతో మంతి కీలక నేతలు టీఎంసీ గూటికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా దీదీకి జై కొట్టడంతో బీజేపీ పరిస్థితి కాస్త ఇబ్బందిగానే మారింది. ఈ పరిస్థితుల్లో మోదీతో దీదీ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: