తెలుగు సినీ పరిశ్రమ... అది చిన్న సినిమా అయినా... పెద్ద సినిమా అయినా... డబ్బింగ్ సినిమా అయినా... ఆడియో రిలీజ్ ఫంక్షన్... ప్రీ రిలీజ్ ఈవెంట్... విజయోత్సవ యాత్ర... సక్సెస్ టూర్... వంద రోజుల పండుగ... ఇలా వేడుక ఏదైనా సరే... హీరో ఎవరైనా సరే... చెప్పే మాట మాత్రం ఒకటే... అదేమిటంటే... ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే... అందుకు ప్రధాన కారణం మీరే అంటూ అభిమానులపై పొగడ్తల వర్షం కురిపిస్తారు. మరి కొంత మంది అయితే... మీరు జాగ్రత్తగా ఉంటేనే.. మీ కుటుంబాలు బాగుంటాయి, మేము కూడా బాగుంటాం అనేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే... ఇవన్నీ పై పై కబుర్లే అని అనిపిస్తోంది. ఇలా చెప్పే మాటలన్నీ కూడా ఏదో పబ్బం గడుపుకోవడానికే అన్నట్లుగా భావించాల్సి వస్తోంది. ఎందుకంటే... హీరోలు చెప్పే మాటలకు... చేస్తున్న పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది. చివరికి ప్రజలు ఎటు పోతే మాకేం... మేము బాగుంటే చాలు అనుకుంటున్నారు మన చిత్ర పరిశ్రమ ప్రముఖులు.

సినీ ఇండస్ట్రీకీ నెల్లూరు జిల్లా ఓ బలమైన ఆదాయ వనరు. నెల్లూరులో సినిమా టాక్ ఎలా ఉంది అనేది తొలి నుంచి పరిశ్రమలో నడుస్తున్న టాక్. అలాంటి నెల్లూరు జిల్లా ఇప్పుడు పీకల్లోతు నీటిలో కూరుకుపోయి ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇప్పట్లే బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మోకాలి లోతు బురద, చెత్తా చెదారంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అయితే సినీ పెద్దల్లో కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. చివరికి నెల్లూరు జిల్లాకు చెందిన మెగాస్టార్ కుటుంబం కూడా ఇప్పటి వరకు నెల్లూరు వాసులకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ పెద్దలపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సినిమా టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వానికి పెద్దలంతా కలిసి లేఖలు ఇచ్చారు. అలాగే పరిశ్రమ కష్టాలు తీర్చాలని ఓ సారి... సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించాలని మరోసారి ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. కానీ ప్రస్తుతం అభిమానులు కష్టాల్లో ఉంటే మాత్రం... కనీసం పట్టించుకోవటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: