కరోనా నుంచి దేశానికి ఉఫశమనం లభించినట్టేనని నిపుణులు అంటున్నారు. గత మూడు వారాలుగా కొత్త కేసులు తగ్గాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనుకున్న పండుగల సీజన్ సేఫ్ గానే ముగిసింది. 98.32శాతం రికవరీ రేటుతో జనాల్లో యాంటీబాడీలు పెరిగాయి. ఇక వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందర్నీ భయపెట్టిన థర్డ్ వేవ్ వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్ ముప్పు.. చలికాలం కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం కనిపించడం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. థర్డ్ వేవ్ వచ్చే అకాశం రోజురోజుకూ తగ్గుతూ వస్తోందన్నారు. మన థర్డ్ వేవ్ చూసే అవకాశం చాలా తక్కువన్నారు. మనం ఇప్పటికే వ్యాక్సిన్లతో రక్షణ పొందామనీ.. వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా త్వరలో రెండు డోసులు వేసుకుంటారని భారిస్తున్నట్టు గులేరియా చెప్పారు.

గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9వేల 283 కరోనా కేసులు నమోదయ్యాయి. 10వేల 949మంది కోలుకున్నారు. 437మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం లక్షా 11వేల 481యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 537రోజుల్లో అత్యల్ప యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

మరోవైపు కరోనా టెస్టులు తగ్గించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టుల సంఖ్య పెంచాలనీ.. లేదంటే కొవిడ్ వ్యాప్తి విస్తృతిని అంచనా వేయడం చాలా కష్టమని తెలిపింది. దేశంలో రోజుకి సగటున 10వేల కేసులు మాత్రమే ఉన్నాయనీ.. టెస్టులు తగ్గడమే ఇందుకు కారణమేమోనని కేంద్రం అనుమానిస్తోంది. పలు దేశాల్లో కరోనా 4, 5వేవ్ లు వస్తున్నాయని.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉంటేనే కరోనా వేవ్ రాకుండా అడ్డుకోవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు థర్డ్ వేవ్ ప్రమాదం లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: