ఆంధ్రప్రదేశ్ పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఏపీ పోలీసుల పనితీరు ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో... ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అద్భుతమైన పనితీరుతో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో పోలీసులు అందిస్తున్న సేవలపై ఐపీఎఫ్ సంస్థ సర్వే నిర్వహించి ర్యాంకులను కేటాయించింది. ఎన్నో అంశాల్లో ఏపీ పోలీసు శాఖ టాప్ ప్లేస్ దక్కించుకుంది. దీనిపై ఇప్పుడు సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కూడా. ఇక జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌లో నిలిచి... శభాష్ అనిపించుకున్న పోలీసు శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ... దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు వైఎస్ జగన్. సచివాలయంలో తనను కలిసి పోలీసు ఉన్నతాధికారులతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని సూచించారు వైఎస్ జగన్.

స్మార్ట్ పోలీసింగ్ సర్వే రిపోర్టును డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందించారు. అలాగే ఐపీఎఫ్ సంస్థ నిర్వహించిన వివరాలను కూడా డీజీపీ సవాంగ్ సీఎంకు వివరించారు. మొత్తం 9 అంశాలను ఐపీఎఫ్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాలలో కూడా ఈ సర్వే నిర్వహించినట్లు ఉన్నతాధికారులు జగన్‌కు వెల్లడించారు. స్మార్ట్ పోలీసింగ్ పద్దతులను అమలు చేయాలని... పోలీసు శాఖను ప్రధాని నరేంద్ర మోదీ 2014లోనే సూచించారు. నాటి నుంచి పలు రాష్ట్రాలు స్మార్ట్ పోలీసింగ్ పద్దతులను చాలా రాష్ట్రాలు ప్రారంభించాయి. దీంతో ప్రతి ఏటా స్మార్ట్ పోలీసింగ్ సర్వేను ఐపీఎఫ్ సంస్థ నిర్వహిస్తోంది. అయితే ఏడాళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి మొదటి ర్యాంక్ లభించింది. ఐపీఎఫ్‌లో సభ్యులుగా రిటైర్డ్ డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ఫ్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. ప్రజలతో పోలీసులు వ్యవహారం, మాట తీరు వంటి అంశాలను ఐపీఎఫ్ పరిగణనలోకి తీసుకుంది. పారదర్శక పోలీసింగ్, ప్రజల నమ్మకం విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: