ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు పెను నష్టాన్నే కలిగించాయి. ప్రత్యేకించి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వరదలు విశ్వరూపం చూపించాయి. ఈ వరద ప్రభావిత జిల్లాల్లో ఎక్కడ చూసిన కన్నీటి గాథలే కనిపిస్తుతన్నాయి. వరద సృష్టించిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాల ప్రకారం వరదల ధాటికి నాలుగు జిల్లాలో 82 వేలకుపైగా ఇళ్లు నీట మునిగాయి. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.


భారీ వర్షాలు నాలుగు జిల్లాలో 198 మండలాలపై తీవ్ర ప్రభావాన్ని కలిగించాయి. భారీ వర్షాలతో సుమారు 8 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇక రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఈ  రహదారుల దెబ్బతినటం వల్ల 1800 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు అధికారులు అంచనా వేశారు. ఇక వీటితో పాటు అనేక చెక్ డ్యాములు, చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. వీటి ద్వారా సాగునీటి శాఖకు 600 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లింది.


ఇక పంటల విషయానికి వస్తే.. వ్యవసాయ రంగంలో 1400 కోట్లు వరకూ నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా.. పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖలకు మరో 2 వేల కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. వీటన్నిటి కంటే ప్రధానమైంది.. వరదల వల్ల కలిగిన ప్రాణనష్టం. ఈ వరదల వల్ల ఇప్పటి వరకూ 40 మంది మరణించినట్టు అధికారికంగానే చెబుతున్నారు.


కడపలో 21 మంది, చిత్తూరులో 8 మంది, అనంతపురంలో 8 మంది వరదల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. వీరితో పాటు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే.. అనధికారిక లెక్కల ప్రకారం.. వంద మంది వరకూ గల్లంతయ్యారు. ఈ భారీ నష్టం నుంచి సీమ ఎప్పుడు కోలుకుంటుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: