ఏపీలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనకున్న ఆలోచనలను ఒక్కక్కటిగా అమలులో పెడుతున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాలకు కారణం అవుతున్నాయనుకుంటే ఏమాత్రం మొహమాట పడకుండా వెనక్కు తీసుకుంటున్నారు, సరికొత్త దారిలో వెళ్లాలనుకుంటున్నారు. మొన్న మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, ఆ తర్వాత శాసన మండలి కొనసాగింపుపై నిర్ణయం, ఇప్పుడు సినిమా టికెట్ల అమ్మకాలను ఆన్ లైన్ లోకి తీసుకురావడం.. ఇలా వరుస సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ఓ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏపీలో సినిమా టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ లోనే జరుగుతాయని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఏ సినిమాకి బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించారు. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో టికెట్ రేట్లను పెంచుకునేందుకు వీలు లేదంటూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు ఆశ్చర్యానికి గురయ్యారు.

అసెంబ్లీలో పేర్ని నాని ప్రకటనతో సినీ ప్రేమికులు సంబరపడిపోతున్నారు. ఇన్నాళ్లూ కొత్త సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలు చూడాలంటే జేబులు ఖాళీ అయ్యేవని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు ఎగ్జిబిటర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాము కూడా ఎప్పటినుంచో ఈ విధానం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ నిర్ణయం, కొందరు బడా నిర్మాతలకు ఇబ్బందికరంగా మారనుంది. కొత్త సినిమాలైనా, భారీ బడ్జెట్ సినిమాలైనా ఒకే ధరకు టికెట్ అంటే వీరంతా అంగీకరించే పరిస్థితి లేదు. ప్రభుత్వంపై ఈ విషయంలో కచ్చితంగా ఒత్తిడి తీసుకు వస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సినీ పెద్దలు ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిశారు. సీఎం జగన్ తో కూడా చిరంజీవి, నాగార్జున తదితర ప్రముఖులంతా కలిశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయంతో మళ్ళీ జగన్ పై ఒత్తిడి తీసుకు వస్తారని సమాచారం. అయితే జగన్ ఈ విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటారా.. లేక వెనక్కు వెళ్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ జగన్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే, మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గినట్టేనని భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ కు వెనకడుగులు అలవాటయ్యాయనే విమర్శలు వస్తాయి. ఏది ఏమైనా ఈ విషయంపై ఇప్పటివరకూ టాలీవుడ్ ప్రముఖులెవరూ నోరు మెదపకపోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: