ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఎన్నో నిర్ణయాలకు హైకోర్టులో బ్రేక్ పడింది. ఇక అదే సమయంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల తీరుపై కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక స్థానాల్లో ఉన్నత అధికారులు  కూడా హైకోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. చివరికి హైకోర్టులో విచారణ  కారణంగానే మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా మరో అంశంలో కూడా జగన్ సర్కార్‌ తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతేడాది కరోనా సమయంలో... సరైన సదుపాయాలు లేవని... కనీసం మాస్కులు కూడా ఇవ్వటం లేదని వైసీపీ సర్కార్‌పై బహిరంగంగానే ఆరోపణలు చేశారు డాక్టర్ సుధాకర్. ఆ తర్వాత అనూహ్య పరిణామాల తర్వాత.... డాక్టర్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే డాక్టర్ సుధాకర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ ఆయన బంధువులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి హైకోర్టు అంగీకరించింది.

అయితే సుధాకర్ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ మృతికి కారణమైన పోలీసులను విచారించేందుకు సీబీఐ ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే జగన్ సర్కార్ మాత్రం అనుమతి నిరాకరించింది. ఇప్పుడు ఇదే విషయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నర్సీపట్నం ఏరీయా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ ఆయన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఆయన పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. బట్టలూడదీసి మరీ రోడ్డుపైనే తన్నుకుంటూ లాక్కెళ్లారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఆయనకు పిచ్చి అని ముద్ర కూడా వేశారు. కొద్ది రోజుల పాటు విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అనంతరం డాక్టర్ సుధాకర్ మరణించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. విశాఖ పోలీసుల్ని ప్రశ్నించేందుకు సీబీఐకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఇప్పుడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్తుల్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అని సూటిగా ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో ఎలా వ్యవహారించాలో మాకు తెలుసని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: