భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వరదల కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు కూరగాయల ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పండిన పంట మొత్తం నీటి పాలైంది. ఇక ఇప్పటికే మార్కెట్‌కు చేరుకున్న పంట కూడా సరైన రవాణా సౌకర్యం లేక... యార్డులోనే కుళ్లిపోతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్ జల దిగ్భందంలో చిక్కుకుంది. దీంతో టమాట ధరలు పెట్రోల్ రేటు కంటే భయపెడుతోంది. ఇప్పటికే హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాటా ధర 150 రూపాయలు పలుకుతోంది. ఇక బహిరంగ మార్కెట్‌లో అయితే కొన్ని చోట్ల 200 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. దీంతో ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇప్పటికే తమిళనాడులో పలు ప్రాంతాల్లో 150 రూపాయలు పైగానే అమ్ముతున్నారు.

టమాట ధరల కట్టడికి స్టాలిన్ సర్కార్ విస్తృత చర్చలు తీసుకుంది. ప్రభుత్వం నిర్వహించే సహకార శాఖ  పరిధిలోని దుకాణాల్లో కిలో టమాటా 79 రూపాయలకు అమ్మేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు, పెరిగిన పెట్రో ధరల కారణంగా రవాణా ఛార్జీలు మోత మోగిస్తున్నాయి. ఇక వర్షాల వల్ల టమాట పంట పూర్తిగా నీటి పాలైంది. సరిగ్గా నెల రోజుల క్రితం కిలో టమాట పది రూపాయలు పలికితే... ఇప్పుడు ఏకంగా 200 రూపాయలకు చేరుకుంది. ప్రజల ఇబ్బందులపై తొలి నుంచి తనదైన శైలిలో స్పందిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఇప్పుడు టమాట కొరత తీర్చేందుకు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రతి రోజు 15 మెట్రిక్ టన్నుల టమాటాలను రాష్ట్ర సహకార శాఖ ద్వారా ప్రభుత్వం సేకరిస్తోందని స్టాలిన్ ప్రకటించారు. టమాటా విక్రయం కోసం చెన్నై నగరంలో 40, ఇతర ప్రాంతాల్లో 65 దుకాణాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో బహిరంగ మార్కెట్‌లో కూడా టమాట ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం చెన్నై నగరంలో కిలో టమాటా వంద నుంచి 120 రూపాయల మధ్య అమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: