ఏపీలో రాజకీయం అధికార వైసీపీ విపక్ష టీడీపీ మధ్యన కేంద్రీకృతమైంది అనుకుంటారు. అయితే ఈ భీకర యుద్ధంలో కొన్ని వ్యవస్థలు కూడా చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. ప్రభుత్వం అంటే ప్రధాన అంగాలు చాలా ఉంటాయి.

వాటిలో అతి ముఖ్యమైనది పోలీస్ వ్యవస్థ. ప్రభుత్వానికి అసలైన అంగంగా కూడా చెప్పాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పోలీసులు వారు చెప్పినట్లుగా చేస్తారు ఇందులో రెండవ మాటకు తావు లేదు.మరో వైపు చట్టం ప్రకారం రూల్స్ కూడా చూసుకుంటారు. అయితే పోలీసుల విషయంలో టీడీపీ చాలా కాలంగా బాణాలను ఎక్కుపెడుతోంది. ఆ పార్టీ నేతలు, సీనియర్లు కూడా ఘాటైన పదజాలాన్నే వారి మీద ప్రయోగిస్తున్నారు.

ఉత్తరాంధ్రా జిల్లాల్లో చూసుకుంటే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసుల మీద తరచూ గట్టిగానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన నర్శీపట్నంలో నిరసన కార్యక్రమాలు చేస్తూండగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు చెబుతున్నారు. దీని మీద ఏకంగా పోలీసు అధికారుల సంఘమే ఆయన్ని టార్గెట్ చేసింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత విశాఖలో మీడియా మీటింగ్ పెట్టి మరీ అయ్యన్నపాత్రుడి మీద మండిపడ్డారు.

పోలీసులు అంటే ఎవరనుకుంటున్నారు అని నిలదీశారు. వారూ వీరూ చెబితే పోలీసులు పనిచేరని, చట్టం ప్రకారమే చేస్తారని ఆమె కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు, బ్రిటిష్ కాలంలో రాసిన చట్టాలనే తాము పాటిస్తున్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కానే కాదని అన్నారు. ప్రజలను పోలీసుల మీద తిరగబడమని అయ్యన్న పిలుపు ఇవ్వడం దారుణమని ఆమె అన్నారు. అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి అయి ఉండి కూడా పోలీసుల మీద ఇలా పరుష పదజాలంతో మాట్లాడడం కంటే బాధాకరం లేదని అన్నారు. దీని మీద తాము రాష్ట్ర హోం మంత్రికి, డీజీపీకి కి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. మొత్తానికి తమ్ముళ్ళు తమ అసహననని అటూ ఇటూ కాకుండా ఏకంగా పోలీసుల మీదకు మళ్ళించడంతో ఖాకీలు మండిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: