ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక రకంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే సెమీ ఫైనల్ పోల్ మ్యాచ్ అని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అభివర్ణించారు కూడా. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్ పైనే ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. యూపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇక సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు కుదిరింది. అదే సమయంలో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక 40 అసెంబ్లీ స్థానాలున్న గోవా రాష్ట్ర  ఎన్నికల బాధ్యతను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించారు కమలం పార్టీ అగ్రనేతలు. ఇప్పటికే యూపీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు. నాలుగు నెలలు ముందుగానే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు.

ఇక ఉత్తరాఖండ్ రాష్ట్ర బాధ్యతను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్రంలో పర్యటించిన మోదీ.. వచ్చే నెల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఉత్తరాఖండ్ ఇంఛార్జ్ ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారం నుంచి మోదీ ఎన్నికల ప్రచారం ఉంటుందన్నారు. టూర్ షెడ్యూల్‌పై ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. మోదీ పర్యటనలో బహిరంగ సభలతో పాటు, పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. డెహ్రాడూన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో రెండు రోజుల పాటు సమావేశం ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై మోదీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు ప్రహ్లాద్ జోషి. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని జోషి ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలం పార్టీ నేతలు ఇప్పటి నుంచి భారీ ప్లాన్ వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: