ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ దూకుడు చూపిస్తోంది. అసెంబ్లీలో తన భార్యను వైసీపీ నేతలు అవమానపరిచారంటూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న కొన్ని రోజుల్లోనే టీడీపీ అగ్రనేతలు జనంలోకి వెళ్లారు. అధినేత చంద్రబాబు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటే.. ఆయన కుమారుడు నారా లోకేశ్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.


వైసీపీ అరాచకాలను ఎండగడతానంటున్న నారా లోకేశ్.. దుగ్గిరాల మండలం చిలువూరులో ప్రసంగించారు. నారా లోకేష్ ఏమంటున్నారుంటే.. “ రాష్ట్రాన్ని కరోనా వైరస్ విడిచిపెట్టినా జగరోనా వైరస్ పట్టి పీడిస్తుంది... పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్ని పన్నుల భారంతో బాదుతున్నాడు.. విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి పన్ను, చెత్త మీద పన్ను ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్నారని లోకేశ్ మండిపడ్డారు.


ఇంకా లోకేశ్ ఏమన్నారంటే.. "ఎన్టీఆర్ గారి హయాం నుండి ఇచ్చిన ఇళ్ల కి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటూ పేదల నుండి 10 వేలు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు.. ఎవ్వరూ కట్టొద్దు..మీకు అండగా మేము న్యాయ పోరాటం చేస్తాం.. జగన్ రెడ్డి రాష్ట్రానికి కంపెనీలు తెచ్చాడని వైసీపీ వాళ్ళు అంటున్నారు.
ఏం కంపెనీలు తెచ్చారని అడిగితే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ , స్పెషల్ స్టేటస్ తెచ్చాం అంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.


ఈ రెండున్నర ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందన్న లోకేశ్.. ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటున్నా కనీస అభివృద్ధి జరగలేదన్నారు. " ఒక్క రోడ్డు వెయ్యలేదు, తాగునీటి సమస్య తీవ్రమైంది. ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్క పట్టా అయినా ఇచ్చారా? మేము అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే పట్టాలు ఇస్తా. స్థానికంగా ఎమ్మెల్యేని గెలిపించారు. ఏనాడైనా మీ ముందుకు వచ్చి మీ సమస్యలు ఏంటో తెలుసుకున్నారా? రాష్ట్రంలో మార్పు దుగ్గిరాల మండలంతోనే ప్రారంభమైంది. ఇక్కడ జరిగిన పంచాయతీ, ఎంపిటిసి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి మార్పు కి నాంది పలికారు. కేసులు పెడతాం అని కార్యకర్తలను భయపెడుతున్నారు. అన్నీ గుర్తుపెట్టుకుంటా ఒక చెంప పై కొడితే రెండు చెంపలు వాచిపోయేలా కొడతానంటూ లోకేశ్ ఆవేశంగా ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: