పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఆ రాష్ట్ర అధికార పార్టీలో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు చుక్కలు చూపించారు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. చివరికి కెప్టెన్ అమరీందర్ తన పదవికీ, పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టేందుకు కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారు కూడా. అయినా సరే... ఏ మాత్రం సిద్ధూ తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు. నిత్యం ఏదో ఒక అంశంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నారు సిద్ధూ. ఎన్నికల నేపథ్యంలో పార్టీ హై కమాండ్ కూడా ప్రస్తుతం సిద్ధూ చర్యలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లేదు. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. సిద్ధూ తాజాగా చేసిన స్టేట్ మెంట్ ముఖ్యమంత్రి చన్నీ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేలా మారింది.

పంజాబ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియా పెరిగిపోయిందని ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాపై నివేదికలను చరణ్ జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశారని కూడా ఆరోపిస్తున్నారు. నివేదిక బయట పెట్టకపోతే... తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేశారు సిద్ధూ. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని.... రాష్ట్రాన్ని  డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తా అంటూ రెండు నెలల క్రితం చన్నీ చేసిన స్టేట్ మెంట్‌ను సిద్ధూ గుర్తు చేశారు. ఒక నివేదిక బయట పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని సిద్ధూ నిలదీశారు. మెగాలోని బాఘ పురానాలో నిర్వహించిన  కాంగ్రెస్ పార్టీ మహాసభలో సిద్ధూ పాల్గొన్నారు. ప్రస్తుతం సిద్ధూ చేసిన కామెంట్లు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే సిద్ధూ ఎదురు తిరగడం రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: