ఏపీలో వరద భీభత్సంతో దాదాపుగా నాలుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు అన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో మిగిలారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. తక్షణ సాయం కింద రెండు వేల రూపాయలు ప్రకటించింది. నిత్యావసర సరుకులను ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోంది. అయితే ఈ వరద సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని చెప్పేందుకు, బీజేపీ నేతలు ఓ కార్యక్రమం ప్లాన్ చేశారు. అటు వైసీపీని కూడా కౌంటర్ చేసేలా కనిపిస్తున్న భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరద బాధితుల సహాయార్ధం నిధి, వస్తు సేకరణ కార్యక్రమంలో భాగంగా జోలెపట్టి విరాళాలను సేకరించేందుకు రోడ్డుపైకి వస్తున్నారు.

తాజాగా విజయవాడలోని లెనిన్ సెంటర్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా జోలె పట్టి భిక్షాటన చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి సాయం చేయాలని అభ్యర్ధించారు. రెండు రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఈ భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలు చేస్తున్న ఈ భిక్షాటనపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి. దీనిపై పంచ్ డైలాగులు కూడా పేలుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, సాయం చేయాలని అధిష్టానాన్ని అడగాల్సింది పోయి, ఇలా రోడ్లపై అడుక్కోవడం ఏమిటంటూ మండిపడుతున్నారు. భిక్షాటనకు వచ్చిన బీజేపీ నేతలను సాధారణ ప్రజలు కూడా విచిత్రంగా చూస్తున్నారు.

ఇక ప్రతీ కార్యక్రమంలో కొత్త పోకడలను తీసుకొచ్చే బీజేపీ, భిక్షాటనలోనూ డిజిటలైజేషన్ మంత్రాన్ని జపించారు. నేరుగా సాయం చేయలేని వారు ఆన్ లైన్ లోనూ సాయం చేయొచ్చంటూ ప్రచారం మొదలు పెట్టారు. ప్రత్యేక QR కోడ్ ను ఇందుకోసం రూపొందించి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపైనా నెటిజన్లు బీజేపీని ఆడుకుంటున్నారు. అడుక్కోవడానికి కూడా ఆన్ లైన్ లోకి వస్తారా అంటూ మీమ్స్ చేస్తున్నారు. ప్రజలకు అండగా ఉండేందుకు చేసిన ఈ కార్యక్రమం కాస్తా ఇప్పుడు బీజేపీ పరువును తీసేసింది. వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తే, చివరకు బీజేపీనే బుక్ అయిపోయిందని సొంత పార్టీనేతలే గుసగుసలాడుకోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: