తెలంగాణ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఇదే క్ర‌మంలో శ‌తృవులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం కొన్ని సంద‌ర్భాల్లో రాజ‌కీయంగా ఏకం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. పై స్థాయిలో కాకపోయిన‌.. కింది స్థాయిలో అవ‌స‌రాల‌ను బ‌ట్టి నేతలు క‌లిసిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఈట‌ల రాజేంద‌ర్‌కు స‌పోర్ట్ చేసింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఒక‌వేళ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తే ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్‌కు లాభం జ‌రుగుతుంద‌ని హుజురాబాద్ ఉప పోరుపై కాంగ్రెస్ పెద్ద‌గా పట్టించుకోలేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

 
    అందువ‌ల్లే కాంగ్రెస్‌కు అక్క‌డ ఎక్కువ‌గా ఓట్లు ప‌డ‌లేదు. అలాగే ఈట‌ల మంచి మెజారిటీతో గెలుపొందారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నించి 20 నుంచి 30 వేల ఓట్లు తెచ్చుకుంటే ప‌రిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. అంటే ప‌రోక్షంగా అక్క‌డ బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా  స‌హ‌కరించింద‌ని అంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో కాషాయ పార్టీ పోటీలో నిల‌బ‌డ‌లేదు. కానీ, కాంగ్రెస్ మాత్రం కొన్ని చోట్ల పోటీలోకి దిగింది. అయితే, కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో బ‌లం లేదు.


  స్వ‌తంత్ర అభ్యర్థులు, క్రాస్ ఓటింగ్‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. దీంతో పాటు స్థానికంగా ఉండే బీజేపీ నేత‌ల‌ను ఒప్పించి వారికి ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు త‌మకు వేయించుకునేలా చూస్తున్నార‌ని తెలుస్తోంది. మెద‌క్ స్థానంలో జ‌గ్గారెడ్డి భార్య నిర్మ‌ల పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్‌కు బ‌లం త‌క్కువ‌గానే ఉంది. కానీ.. బీజేపీ, ఇండిపెండెంట్‌ల స‌పోర్ట్ తీసుకుంటే టీఆర్ఎస్ కు గ‌ట్టిపోటీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. ఎలాగో హుజురాబాద్‌లో స‌హ‌క‌రించాం క‌దా.. ఇక్క‌డ మాకు స‌పోర్ట్ చేయండంటూ బీజేపీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: