కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ ఎన్నిక ఫలితాలు కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి నుండి ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చుట్టూ తిరుగుతున్న కొండపల్లి రాజకీయం రక్తి కట్టించింది. పోలీసు బలగాల మద్య జరిగిన కొండపల్లి పాలకవర్గ ఎన్నిక మాత్రం ఒక కొలిక్కి వచ్చింది.. అయితే ఎన్నికలో 15 మంది కౌన్సిలర్లు టిడిపి కి జై కొట్టడంతో కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి వశం అయినట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటన రావాలి అంటే హై కోర్టు తీర్పు పై ఆధారపడి ఉండటంతో కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ కొలువులపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్న అనూహ్యంగా కోర్టు తీర్పు వాయిదా వేయడంతో కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా అనేక ప్రచారాలు ఊపందుకున్నాయి. కోర్టులో తీర్పు వాయిదా వేయడంపై భిన్న వాదనలు తెరమీదకు వచ్చాయి. కోర్టు తీర్పు వాయిదా అంశం లో ఎంపి ఎక్సోఫిషియ ఓటు నిర్ధారణకు సంభందించి పూర్తి వివరాల సేకరణకు ఎన్నికల కమీషన్ వాయిదా కోరినట్లు విశ్వసనీయ సమాచారం ఉంది.. కానీ అలా కాదు ఎంపి కేశినేని నాని వాయిదా కోరినట్లు మరో ప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా కొండపల్లిలోని ఒక వార్డులో రీకౌంటింగ్ కొరకు టిడిపి నేతలు కోర్టును ఆశ్రయించబోతున్నారు అంటూ మరో ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ మొత్తం ప్రచారం లో భాగంగా మళ్ళీ కొండపల్లి పాలకవర్గ ఎన్నికపై మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది. మొదటి నుండి వైసీపీ వర్గాలు చెబుతున్నట్లు ఎంపి ఎక్సోఫిషియ ఓటుపై సందేహాలు ఉన్నాయా... అది కుదరక కొండపల్లి ఒక వార్డులో రీకౌంటింగ్ పట్టు బడుతున్నారా... ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కొండపల్లి మున్సిపాలిటీ ఒక కొలిక్కి వచ్చిందని భావించిన యావత్ కొండపల్లి ప్రజానీకానికి కోర్టు తీర్పు వాయిదా, జరుగుతున్న ప్రచారం మళ్ళీ సందిగ్ధంలో పడేస్తున్నాయి. దీంతో ఏది వాస్తవం, ఏది అవాస్తవం తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. జరుగుతున్న ప్రచారానికి తెర పడాలి అంటే కోర్టు తీర్పు వెలువడల్సిందే అనేది మాత్రం స్పష్టం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: