పంట ఇంటికి వ‌చ్చే వేళ ఆనందం
అదే స‌మ‌యంలో ఉత్కంఠ‌త కూడా!
ఈ ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు చేపట్టిన
ధాన్యం కొనుగోలు స‌వ్యంగా సాగితే
రైతు ఖాతాల‌కు నాలుగు డ‌బ్బులు వ‌చ్చి చేరితే
పంట న‌ష్టం పోను రైతుల‌కు ఏమ‌యినా మిగిలితే
అదే నిజం అయిన సంక్రాంతి! కానుంది.


 
ఎలా అయినా సాగు అన్న‌ది న‌ష్ట‌దాయ‌కం అనే నిరూపిస్తోంది ప్ర‌కృతి. అయినా ఆరుగాలం శ్ర‌మించే రైతుకు ఆస‌రాగా ఉండాల‌న్న‌ది జ‌గ‌న్ ల‌క్ష్యం. ఈ క్ర‌మంలోనే రుణ‌మాఫీ రూపంలోనో, పెట్టుబడి సాయం రూపంలోనో ఏదో ఒక‌టి విధంగా త‌న‌వంతుగా రైతుకు ఊతం అందిస్తూనే ఉన్నారు. కానీ వీటి ఫ‌లితాలు క్షేత్ర స్థాయిలో ఆశించిన తీరులో ఉండ‌డం లేద‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. దీంతో సీజ‌న్ పంటలు,  ప్ర‌త్యామ్నాయ పంట‌లు ఇంకా సాగుకు సంబంధించిన ప‌నులు అన్నీ  కూడా రైతుకు క‌లిసి వ‌చ్చేందుకు వీల్లేకుండానే ఉన్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్ వ్య‌వ‌స్థ మొత్తం ప్ర‌యివేటు వ్య‌క్తుల చేతిలోనే ఉంది. ఈ నేప‌థ్యంలో ధాన్యం కొనుగోలు అన్న‌ది ఓ ప్ర‌హ‌స‌నంగా మార‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్నా కూడా అవేవీ స‌త్ఫ‌లితాలు ఇచ్చిన దాఖ‌లాలు లేవు. ఈ క్ర‌మంలో రైతుకు అండ‌గా ఉండేదెవ్వ‌రు? మిల్ల‌ర్ల మోసాల‌ను అడ్డుకునేదెవ్వ‌రు?



రైతు చ‌ట్టాల అమ‌లు వాటి నిష్క్ర‌మ‌ణ లేదా మిగ‌తా వాటి తీరు ఎలా ఉన్నా ఈ సారి ఖ‌రీఫ్ సీజ‌న్ లో వ‌చ్చిన ధాన్యం కొనుగోలు తోనే ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌త అన్న‌ది దాగి ఉంది. ఒక‌వేళ ఆర్బీకే ల ద్వారా స‌క్ర‌మ రీతిలో ధాన్యం కొనుగోలు చేయ‌లేక‌పోతే జ‌గ‌న్ ప్ర‌భుత్వం నింద‌లు మోయ‌డం ఖాయం. ఈ త‌రుణంలో రైతును ఆదుకునే ప్ర‌భుత్వంగా జ‌గ‌న్ స‌ర్కారు నిలిచిపోతుందో లేదో అన్న‌ది ఇప్పుడొక ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఎందుకంటే గ‌తంలో త‌లెత్తిన లోపాలు ఈ సారి చోటుచేసుకోకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త స‌ర్కారుదే!



వ‌రుస తుఫానులు వ‌రుస అల్ప‌పీడ‌న ప‌రిణామాలు ఒక్క‌టేంటి అన్ని విప‌త్తుల కార‌ణంగా రైతు అత‌లాకుత‌లం అయిపోతున్నా డు. ఈ ద‌శ‌లో ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి అధికారులు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఆంధ్రావ‌నిలో ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి అధికారులకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు రూప‌క‌ల్ప‌న చేసింది. ధాన్యం సేక‌రించాక సంబంధిత మొత్తాల‌ను వెనువెంట‌నే రైతుల ఖాతాల‌కు జ‌మ అయ్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచిస్తోంది. శ్రీ‌కాకుళం జిల్లాలో 7 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించామని జాయింట్ క‌లెక్ట‌ర్ విజ‌య సునీత తెలిపారు. అయితే అంచ‌నాల‌కు మించి  9 లక్షల 23 వేల 862 మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధిత సేక‌ర‌ణ కేంద్రాల‌కు చేర‌నుంద‌ని అన్నారు.




ఎ - గ్రేడ్ రకానికి క్వింటాకు 1960 రూపాయ‌లు, కామన్ రకానికి క్వింటాకు 1,940 రూపాయ‌లు చెల్లించేందుకు ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చింద‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి రైతు భ‌రోసా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లూ చేశామ‌ని తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ ఏడాది పంట న‌ష్టం విపరీతంగా ఉంది. ఎక్క‌డిక‌క్క‌డ పంట‌లు కోల్పోయి రైతులు దిగాలుగా ఉన్నారు. గులాబ్ తుఫానుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ప‌రిహారం చెల్లించేందుకు నిధులు విడుద‌ల చేశారు. కానీ ఇవి ఏ మాత్రం త‌మ‌కు క‌లిసివ‌చ్చేవి కావ‌ని రైతులు గ‌గ్గోలు పెడుతున్నాడు. బీమా చేయించుకోలేని రైతులు అంతా ఇవాళ ఎంత‌గానో నష్ట‌పోతున్నార‌ని వీరంతా వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: