ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంది. తాము ఎన్నో ఆశలతో పార్టీ కోసం పది ఏళ్ళు కష్టపడి ఎమ్మెల్యేలం అయ్యామని ... అయితే ఇప్పుడు కనీసం తమ నియోజకవర్గాల్లో చిన్న చిన్న ప‌నులు కూడా చేయించే పరిస్థితి  లేదని పలువురు వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో ఎంతో అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పుకుంటున్నా కూడా తమతమ నియోజకవర్గాల్లో ప్ర‌జ‌లు అడుగుతున్న చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అని వైసీపీ అధినేత ఎంత చెప్పుకుంటున్నా కూడా.. జనసేన - టిడిపి పొత్తు ఉంటే తమకు కచ్చితంగా శంకరగిరి మాన్యాలు తప్పవని కొందరు వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేగుతోంది. కాపు సామాజికవర్గం , పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అందరిలోనూ జనసేన - టిడిపి పొత్తు కచ్చితంగా త‌మ గెలుపు పై ప్రభావం చూపుతుందని ఆందోళ‌న ఉంది.

ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు జనసేన - టిడిపి పొత్తు ఉంటే 2024 ఎన్నికల్లో తాము గెలిచే ప‌రిస్థితి లేద‌ని.. తమ తమ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో జనసేన 20 నుంచి 50 వేల వరకు ఓట్లు చీల్చిందని ... దీంతో తమ గెలుపు సులవు కావడంతో పాటు తమకు మంచి మెజారిటీ వచ్చింద‌ని చెబుతున్నారు.

కాబట్టి 2024 ఎన్నికల్లో టిడిపి - జనసేన పొత్తు కుదిరితే గెలిచే పరిస్థితి లేదని కూడా చెబుతున్నారు. అందుకే చాలామంది గోదావరి జిల్లాల‌ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టిడిపి - జనసేన పొత్తు లేకుండా ఉంటే బాగుంటుందని దేవుళ్లను ప్రార్థిస్తున్న‌ పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: