చంద్రబాబుది నాలుగు దశాబ్దాల రాజకీయం. ఆయనంత సీనియర్ మోస్ట్ నేత రెండు తెలుగు రాష్ట్రాలో ఎవరూ లేరని చెప్పవచ్చు. ఇక ఈ రోజుకీ క్రియాశీలకంగా ఉంటున్న నేత కూడా బాబే. ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు చంద్రబాబు.

ఆయనకు రాజకీయాలే ఊపిరి. ఆయనకు అది ఇష్టం కూడా. ఆయన ఏడు పదుల వయసులో కూడా ఎక్కడా అలుపూ సొలుపూ లేకుండా రాజకీయాలను చేసుకుంటూ వస్తున్నారు. ఇక చంద్రబాబు పాలిటిక్స్ చూసిన వారు చెప్పే మాట ఏంటి అంటే ఆయన వాస్తవవాది అని. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరు అని గట్టిగా నమ్మే సిద్ధాంతం బాబుది. అలాంటి బాబు రాజకీయంగా లాభం ఉంటే ఏదైనా చేస్తారు అని చెబుతారు. ఆయన తన పార్టీ వారిని పక్కన పెట్టి గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి వచ్చిన 23 మందిలో నలుగురిని మంత్రులుగా చేశారు.

అలా జంపింగ్ జఫాంగులను బాబు ప్రతీ సారీ ప్రోత్సహిస్తున్నారు. అయితే దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని బాబు గ్రహించారు అంటున్నారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీ దారుణంగా చతికిలపడింది. అయితే బాబు తాను పదవులు ఇచ్చి అధికార హోదాలు ఇచ్చిన వారు అంతా మౌనంగా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అదే సమయంలో టీడీపీలో ఇపుడు ద్వితీయ తృతీయ శ్రేణి  నాయకత్వమే చురుకుగా ఉంది. దాంతో వారి కష్టాన్ని బాబు కూడ గుర్తించారు అంటున్నారు.

ఇక మీదట ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయకూడని పార్టీ కోసం పనిచేసే వారికే అగ్ర తాంబూలం ఇస్తామని బాబు అంటున్నారు. బాబు కనుక ఇది అమలు చేస్తే చాలా మందికి ఇబ్బందే. ఎందుకంటే ఎన్నికల వేళ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటూ నాయకులు వస్తారు. దాంతో వచ్చిన వారే టికెట్లు ఎగరేసుకుపోతారు, పదవులూ పట్టుకుపోతారు. బాబు కనుక ఇలా కచ్చితంగా ఉంటే మాత్రం అయారాం గయారాం లకు గడ్డు రోజులే. అంతే కాదు, పార్టీలో పనిచేయకుండా ఉన్న వారికీ ఇబ్బందే. మరి బాబు ఒక విధంగా రెడ్ సిగ్నల్సే పంపించారు. మరి దీని వల్ల టీడీపీ నేతలు యాక్టివ్ అవుతారా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: