ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా మారాయి. 2019  సార్వత్రిక ఎన్నికల్లో
ఘన విజయం సాధించిన తర్వాత... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను ఎంపిక చేశారు. అయితే దీనిపై న్యాయ స్థానంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. ఇక అమరావతి ప్రాంతమే రాష్ట్రానికి రాజధాని అంటూ రైతులు ఆందోళనలు చేపట్టారు. సేవ్ అమరావతి పేరుతో మహా పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఈ పాదయాత్రకు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో.. ప్రభుత్వం కూడా వెనుకడుగు వేసింది. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ బిల్లును రద్దు చేస్తున్నట్లు నాలుగు రోజుల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదే సమయంలో ఈ బిల్లు స్థానంలో సమగ్రంగా మరోసారి బిల్లు తయారు చేసి తీసుకువస్తామని కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో రోజు వారీ విచారణ జరుగుతోంది. అయితే బిల్లులను రద్దు చేసినట్లు ఇప్పటికే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే దీనిపై పూర్తి వివరాలతో మెమో దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఏజీని ఆదేశించింది. బిల్లులు అటు అసెంబ్లీలో, మండలిలో రద్దు అయిన తర్వాత ఈ రోజు  హైకోర్టులో మెమో దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి హైకోర్టులో ప్రభుత్వం తరఫున మెమో దాఖలు చేశారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా మెమోలో హైకోర్టును కోరారు. మెమో స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగిస్తున్న త్రి సభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మెమోపై సోమవారం కీలక విచారణ చేపట్టనుంది హైకోర్టు. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: