పాలనలో ఎవరి స్టైల్ వారిదే. ఎవరి ఆలోచనలు వారివే. అందుకే జనాలు ఒకరిని దించి మరొకరిని కోరుకుంటారు. అయితే దిగిపోయిన వారు తమలాగానే కొత్త వారు కూడా పనిచేయాలని కోరుకోవడం రాజకీయమే కాక అత్యాశ కూడా అవుతుంది.

ఇదంతా ఎందుకు అంటే ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు జగన్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరివీ భిన్న మార్గాలు. చంద్రబాబు హడావుడి ఎక్కువగా చేస్తారని పేరు. జగన్ మీడియా ముందుకే అసలు రారు. అయితే అలాగని కాదు, కొన్ని వేళల్లో అయితే ముఖ్యమంత్రి జనాల్లోకి రావాలి కదా అన్న చర్చ ఉంది. ఇపుడు అదే ఏపీలో సాగుతోంది. రాయలసీమలో జల ప్రళయం సంభవించింది.

దాంతో అక్కడ జనాలు బెంబేలెత్తిపోయారు. మరి వారిని సీఎం ఓదార్చవద్దా అంటున్నారు టీడీపీ నేతలు, దీని మీద చంద్రబాబు నుంచి బీజేపీ, జనసేన నేతల దాకా  జగన్ నే టార్గెట్ చేశారు. దానికి జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఏంటి అంటే తాను రావడం ముఖ్యమా, జనాలకు మేలు చేయడం ముఖ్యమా అని. సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందనే తాను వరద ప్రాంతాలకు వెళ్లలేదని కూడా జగన్  చెప్పారు.

ఇక చాలా మంది సీఎం లు కూడా వరదల విషయంలో మోనిటరింగ్ చేసే విధానం  గురించి వివరిస్తూ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఎపుడైనా వరదలలో టూర్లు పెట్టుకుంటూ కనిపించారా అని ప్రశ్నించారు. దీని అర్ధం ఏంటి అంటే ఒడిషా సీఎం లాంటి వారు తనకు ఆదర్శమని జగన్ చెప్పకనే చెప్పడమే. అంతే కాదు,జగన్ ఆయన్ని అనుసరిస్తున్నారు అన్న భావన చాలా విషయాల్లో కలుగుతోంది. ఒడిషా సీఎం ఢిల్లీకి కూడా ఎక్కువగా పోరు, ఆయన రెండు దశాబ్దాలుగా సీఎం గా ఉంటున్నారు. ఇక మీడియా సమావేశాలు కూడా ఆయన పెద్దగా పెట్టరు. బహుశా జగన్ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే అక్కడ మాదిరిగానే రెండు దశాబ్దాలకు పైగా తాను కూడా సీఎం గా ఉండవచ్చు అని ఆలోచిస్తున్నారేమో చూడాలి. ఏది ఏమైనా జగన్ చెప్పినది కూడా బాగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: