ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో ఇవాళ తీవ్ర ఉత్కంఠ- ఉద్రిక్తత నెలకొన్న‌ది. నామపత్రాలు సమర్పించిన 24 మందిలో దాదాపుగా 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.  టీఆర్ఎస్  అభ్యర్థిగా దండె విఠల్‌, తుడుందెబ్బ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి నామినేషన్ వేసారు.  పుష్పరాణి నామినేషన్‌ ఉపసంహరించుకున్న‌ట్టు  ఎన్నికల అధికారులకు సంపత్‌ అనే వ్యక్తి చెప్పారు. అయితే నామ పత్రంలో ప్రతిపాదించిన పేర్లలో సంపత్‌ పేరు లేకపోవడంతో ఎన్నికల అధికారి అభ్యంతరం వ్య‌క్తం చేసారు.  పుష్పరాణితో ఉపసంహరణ చేసుకున్న‌ట్టు  ఫోన్‌ చేయించాలని  అధికారి సూచించారు.  

ఈ త‌రుణంలోనే ఆదిలాబాద్‌ కలెక్టరేట్ వ‌ద్ద‌కు స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి వచ్చారు. తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్లు వ‌స్తున్న‌ ప్రచారంపై  ఆమె అభ్యంతరం వ్యక్తం చేసారు. తాను బరిలో ఉన్న‌ట్టు ప్రకటించారు పుష్పరాణి.  అంతలోనే పుష్పరాణికి మద్దతిస్తున్నట్టు బీజేపీ కూడా  ప్రకటించింది. దీంతో పరిస్థితి అంతా ఒక్కసారిగా ఉద్రిక్త‌త‌గా మారిపోయింది.  టీఆర్ఎస్‌, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలు చేసాయి.  దీంతో ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఇరు పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ  వాతావ‌ర‌ణం నెల‌కుంది.  పోలీసులు  అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు.  పుష్పరాణిని అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు యత్నించారు.  ఆమెను పంపించ‌కుండా ముఖ్యంగా తుడుందెబ్బ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు.

అయితే రిటర్నింగ్ అధికారి కార్యాల‌యంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విఠ‌ల్ అనుచ‌రులు ఉన్నార‌ని.. కానీ త‌నను లోప‌లికి అనుమ‌తించ‌డం లేద‌ని పుష్పారాణి అభ్యంత‌రాన్ని తెలియ‌జేసారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి రోజు కావ‌డంతో ప‌రిస్థితి ఉత్కంఠంగా మార‌డంతో ఏమి జ‌రుగుతుందోన‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌,  బాల్క సుమ‌న్‌, కోనేరు కోన‌ప్ప ఆదిలాబాద్ క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లోనే వేచి ఉన్నారు. నామినేష‌న్ ఉప సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగియ‌డంతో ఉమ్మ‌డి ఆదిలాబాద్ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌కు ఇద్ద‌రూ అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచిన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా దండె విఠ‌ల్, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పుష్ప‌రాణి పోటీలో ఉన్న‌ట్టు వెల్ల‌డించారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: