ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్,  గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు మెగా సెమీ ఫైనల్ పోరుకు రెడీ అవుతున్నాయి. యూపీ ఎన్నికల కోసం ఇప్పటికే పొత్తులు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక పంజాబ్ కోసం ఆప్ సింగిల్‌గా పోటీ చేస్తోంది. గోవాలో తమ బలం నిరూపించుకునేందుకు ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ మెగా ప్లాన్ వేస్తోంది. మణిపూర్ అసెంబ్లీని దక్కించుకునేందుకు బీజేపీ అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పరిస్థితులపై పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ అధినేత స్వయంగా సమావేశమయ్యారు.

తాజాగా మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలోని నగైఖోంగ్ ఖునౌ ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు. మణిపూర్‌లో గో టూ విలేజ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది జరిగే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి బీజేపీ ప్లాన్ చేస్తోంది. గోవాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న జేపీ నడ్డా... నేటి నుంచి రెండు రోజుల పాటు మణిపూర్  రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాబోయే రోజులు పార్టీకి అత్యంత కీలకమైనవని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కమలం పార్టీ కార్యకర్తలు వెళ్లాలని సూచించారు జేపీ నడ్డా. ప్రజలకు సంక్షేమ పథకాలు,  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో ప్రారంభించిన గో టూ విలేజ్ కార్యక్రమం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరే వరకు గో టూ విలేజ్ 2.0 కార్యక్రమం కొనసాగుతుందన్నారు జేపీ నడ్డా.


మరింత సమాచారం తెలుసుకోండి: