కరోనా కొత్త వేరియంట్ విమాన ప్రయాణాల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ అనే వేరియంట్ వెలుగు చూసింది. అక్కడ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ వణికిపోతున్నాయి. ఈ కరోనా వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పలు కేసులు వెలుగు చూడటంతో వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఈ వేరియంట్ కాస్తా.. ఇప్ప్పుడు హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం వరకూ వ్యాపించి, అక్కడ కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

ఈ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా విమానయాన రంగం పూర్తిగా కుదేలు కానుంది. ఇప్పటికే విమానాలు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. భారత్ లో అయితే గత కరోనా సీజన్ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతానికి కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకొని విమాన సర్వీసులను నడుపుతోంది. తాజాగా డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో ఏం చేయాలో పాలు పోక విమానయాన సంస్థ అధికారులు భయపడిపోతున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మన దేశం నుంచి కొన్ని దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేశారు. దక్షిణాఫ్రికాతో పాటూ,  బ్రెజిల్, బంగ్లాదేశ్ లోనూ కేసులు రావడంతో ఆయా దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎందుకైనా మంచిదని చైనా, మారిషస్, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు కూడా సర్వీసులను నిలిపివేశారు. మనదేశ విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో విదేశాలకు వెళ్ళేవారిలో ఆందోళన మొదలైంది. విదేశీ ప్రయాణం చేయాలంటేనే ఇప్పుడు భయపడిపోతున్నారు. ఈ కొత్త వేరియంట్ పై ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అత్యవసరంగా భేటీ అయింది. తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలను కూడా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: