సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేల పొగడ్తలు మరీ శృతి మించిపోతున్నాయి. విమర్శలనయినా కొన్నిసార్లు తట్టుకోవచ్చు కానీ, పొగడ్తలు మాత్రం మరీ ఎక్కువయితే కష్టం. ఇటీవల ప్రతిపక్షం లేని ఏపీ అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది. ఈ పొగడ్తల కార్యక్రమం గతంలోనూ జరిగింది కానీ, ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ సమయం దగ్గర పడుతున్న సమయంలో అది కాస్తా మరీ ఎక్కువైంది. తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎంను ఓ రేంజ్ లో పొగుడుతూ వెళ్లారు. అసెంబ్లీలో ఆయన పొగడ్తలు చూసి జగన్ కూడా కాస్త ఇబ్బంది పడాల్సివచ్చిందంటే అతిశయోక్తి కాదు. అంతలా సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించారు. విద్యార్థులకు మెరుగైన యూనిఫారం, బ్యాగులు, పుస్తకాలు అందజేశారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా కాళహస్తి ఎమ్మెల్యే ఈ విషయంలో మరీ గీత దాటేసి పొగిడినట్టు అనిపించింది. సంక్షేమ కార్యక్రమాల గురించి గ్రీకుల కాలంలోనే రాసి ఉందని.. అప్పటి నుంచి సంక్షేమాన్ని అసలు దేశంలో ఎవరూ పట్టించుకోలేదని, జగన్ ఒక్కడే ఇప్పుడు సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టినట్టుగా చెప్పుకొచ్చాడు. ఇక నెల్లూరు ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి కూడా తక్కువ తినలేదు. ఆయన కూడా జగన్ ను ఆకాశానికెత్తేశారు. తన ప్రశంసలతో సీఎంను ఉక్కిరి బిక్కిరి చేశారు.

ఇటీవల నెల్లూరు జిల్లాలో బాలినేని పర్యటించారు. వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. ఈ విషయాన్ని కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. ఒక వైపు రాష్ట్రంలో వరదల భీబత్సం జరిగి జనం అల్లాడిపోతుంటే, ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలతో జనమంతా సంతోషిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీనంతటికీ కారణం జగన్ ఒక్కడేనని మళ్ళీ పొగడ్తలు ప్రారంభించారు. ఇలా ఏదో ఒకసాకుతో జగన్ ను కీర్తించడం ఎమ్మెల్యేలకు బాగా అలవాటైపోయింది. ఒకవేళ పొగడక పోతే వెనుకబడి పోతామని ఎమ్మెల్యేలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారట. జగన్ కూడా కొంతవరకూ ఈ ప్రశంసలను ఎంజాయ్ చేసినా.. మరీ శృతి మించి పోతుంటే మాత్రం వీటికి కళ్లెం వేయక తప్పదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: