ఆంధ్రావ‌నిలో పాలిటిక్స్ అంతుప‌ట్ట‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకోవ‌డం మిన‌హా ఇక్క‌డి నేత‌లు సాధిస్తున్న‌ది ఏమీ లేదు. ముఖ్యంగా రాజ‌ధాని రాజ‌కీయం అస్స‌లు అంతు ప‌ట్ట‌డం లేదు. టీడీపీ హయాంలో ఊరుకుని ఇప్పుడెందుకు మాకు ఈ రాజ‌ధాని అని అమ‌రావ‌తి విష‌య‌మై జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌సంగాలు కానీ లేదా ప్ర‌క‌ట‌న‌లు కానీ క‌ల్లోలాల‌ను సృష్టిస్తున్నాయి. అమ‌రావ‌తిలో ఒక ఎక‌రం డెవ‌ల‌ప్ చేయాలంటే రెండు కోట్ల రూపాయ‌లు అవ‌సరం అవుతుంద‌ని, యాభై వేల ఎక‌రాల‌కు ల‌క్ష కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు.


అంత మొత్తం కేవ‌లం మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కే స‌రిపోతాయ‌ని, ఒక రాష్ట్ర బ‌డ్జెట్ మొత్తం ఒక న‌గ‌రానికి కేటాయించ‌లేమ‌ని, అయినా ఇప్ప‌టిక‌ప్పుడు ప‌నులు అంత త్వ‌ర‌గా పూర్తి కావ‌ని, నాలుగైదేళ్లు ప‌డుతుంద‌ని జ‌గ‌న్ మొన్న‌టి వేళ చెప్పారు. అంటే రానున్న నాలుగైదేళ్ల‌లో ఖ‌ర్చు నాలుగింత‌లు అవుతుంద‌ని ఆ లెక్క ప్ర‌కారం చూసుకున్నా నాలుగు నుంచి ఐదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఒక్క రాజ‌ధాని న‌గ‌రానికే వెచ్చించాల్సి వ‌స్తుంద‌ని వివ‌రించారు. అందుకే తాము ఖ‌ర్చు చేయ‌మ‌ని, పాల‌నా సంబంధ వ్య‌వ‌హారాల‌కు అమ‌రావ‌తిని కాకుండా విశాఖ‌ను ఎంచుకున్నామ‌ని కొన్ని పొదుపు సూత్రాలు వ‌ల్లెవేశారు. ఇవ‌న్నీ బాగున్నాయి కానీ ఆ రోజు తాము రాజ‌ధాని నిర్మాణం చేపట్టేట‌ప్పుడు కానీ లేదా ప్ర‌క‌టించేట‌ప్పుడు కానీ క‌నీస స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేయ‌కుండా ఇప్పుడిలా యూ ట‌ర్న్ తీసుకోవ‌డం జ‌గ‌న్ కే చెల్లింద‌ని టీడీపీ అంటోంది.

ఈ నేప‌థ్యంలో రైతుపై ప్రేమ అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఒల‌కబోస్తున్న‌ప్ప‌టికీ మూడు పంట‌ల పండే భూములున్న ప్రాంతాన్ని ఎలా ఎంపిక చేస్తారు అన్న‌ది అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నం అయింది. వామ‌ప‌క్షాలు కూడా ఈ విష‌య‌మై అస్స‌లు అడ‌గ‌లేదు. ప్ర‌భుత్వాల‌ను నిల‌దీయ‌లేదు. కేంద్రం కానీ నేష‌న‌ల్ గ్రీన్ కోర్ కానీ పుష్క‌ల జ‌ల‌ వ‌న‌రులున్న నేల‌ల‌ను సుసంప‌న్నం  చేయ‌కుండా, ప‌చ్చని సిరుల‌తో తుల‌తూగ‌నివ్వ‌కుండా ఏ విధంగా రాజ‌ధాని నిర్మాణానికి ఒప్పుకుంటార‌ని కూడా నిల‌దీయాల్సిన సంబంధిత వ్య‌వ‌స్థ‌లు ఏవీ ప‌ల్లెత్తు మాట అన‌లేదు. దీంతో కేంద్రం ఇచ్చిన నిధులు ఇష్టారాజ్యంగా ఖ‌ర్చుచేశారు అన్న నింద కూడా చంద్ర‌బాబుపై ప‌డింది. రాజ‌ధాని నిర్మాణానికి తాము ఇచ్చిన నిధుల‌ను సంబంధిత ప‌నుల‌కే కేటాయించాలి కానీ ఇలా  చేయ‌డం త‌గ‌ద‌ని వేరే ప‌నుల‌కు కానీ వేరే ప‌థ‌కాల‌కు కానీ మళ్లించ‌డం త‌గ‌ద‌ని కేంద్రం మండిపడింది. అస‌లే కొత్త రాష్ట్రం దాంతో పాటు ఇంకా ఎటువంటి ఆర్థిక వ‌నరులూ లేని రాష్ట్రం కావ‌డంతో చంద్ర‌బాబు ఆ రోజు ఆ విధంగా కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌ని ఇప్ప‌టికీ టీడీపీ నాటి ప‌రిణామాల‌పై వివ‌ర‌ణ ఇస్తూనే ఉంది.



ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌ధాని అమ‌రావ‌తిగా ఉంచేందుకు వైసీపీకి మ‌న‌సొప్ప‌డం లేదు. ఆ విధంగా చేస్తే క‌మ్మ సామాజిక‌వర్గానికి మేలు చేసిన వారం అవుతామ‌ని, ఆ విధంగా సంబంధిత రియ‌ల్ట‌ర్లు బాగుప‌డ‌తార‌ని జ‌గ‌న్ తో స‌హా ఇత‌ర వైసీపీ  వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకే క‌ష్టం అయినా స‌రే విశాఖ‌కు స‌చివాల‌యాన్ని తీసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మంత్రి బొత్స, దిగ్గ‌జ నేత ధ‌ర్మాన ఇలా చాలా మంది రాజ‌ధాని పై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తూ త‌మ‌కు ఈ ప్రాంతం అంగీకారం లేద‌ని ఉత్త‌రాంధ్ర త‌ర‌ఫున గొంతుక వినిపిస్తూ త‌మదైన రాజ‌కీయం చేస్తున్నారు. ఈ త‌రుణంలో రాజ‌ధానిగా అమ‌రావ‌తి అన్న‌ది ముందున్న కాలం ఉన్నా లేన‌ట్లే! ఆ విధంగా టీడీపీ ఆశ‌లు హుళ్ల‌క్కే ! గ‌ల్లంతే!

మరింత సమాచారం తెలుసుకోండి: