తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఆన్ లైన్ టికెటింగ్ విషయంలో టీడీపీ బకరా కాబోతోందా..? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలుగు దేశం పార్టీ నేతలను ఇద్దరూ కలిసి బకరాలను చేసేలానే కనిపిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ లోని పెద్దలెవరూ ఆన్ లైన్ సినిమా టికెట్ల వ్యవహారంలో సానుకూలంగా లేరు. అలాగని వ్యతిరేకంగానూ ప్రకటనలు చేయలేదు. చిరంజీవి మాత్రం ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పునరాలోచించాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయంపై మంత్రి పేర్ని నాని కూడా సానుకూలంగానే స్పందించారు. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

 

ఈ వివాదాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు టీడీపీ అండగా ఉందనేలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. టాలీవుడ్ కు మద్దతుగా స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. టీడీపీ నేతలు ఎంతలా మద్దతిస్తున్నా సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ కనీసం స్పందించడం లేదు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు టీడీపీతో కలిసి పోరాడదామనే ఆలోచన అంతకన్నా లేదు. ఎందుకంటే టీడీపీతో కలిస్తే జరిగే లాభం కంటే, వచ్చే నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకు బాగా తెలుసు.  అందుకే టీడీపీ ఎంతగా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నా వారు మాత్రం పట్టించుకోవడం లేదు.

ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాలు, బెనిఫిట్ షో ల రద్దు తదితర విషయాలపై ప్రస్తుతానికి టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. అయితే రేపోమాపో సినీ పరిశ్రమ పెద్దలు సీఎం జగన్ ను కలుస్తారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఓ మాటపైకి వస్తారు. ఇలా చివరకు ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ ఒకే మాట మీదకు వచ్చేస్తే మధ్యలో టీడీపీయే బకరా అవుతుంది. ఈ విషయం తెలియక టీడీపీ నేతలు అనవసరంగా ఈ వివాదంలోకి వచ్చి ఇరుక్కున్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా ఇలా సినిమా సమస్యలపై పోరాటం చేయాలనుకుని చేతులు కాల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: